Reading Time: < 1 minute
Atacama Desert Blooms After El Nino Rains As Thousands Of Hectares Turn Into A Flower Carpet

El Nino Effect: ప్రపంచంపై ఈ ఏడాది ‘‘ఎల్ నినో’’ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌ నినో పరిస్థితులు తీవ్రంగా మారినట్లు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎల్ నినో వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల నెలకొంటే, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు సంభవిస్తాయి.

ఇదిలా ఉంటే, ఎల్ నినో ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన చిలీలోని అటకామా ఎడారిలో ఇప్పుడు రంగురంగుల పూలు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా బీడు భూములుగా ఉండే ఈ ఎడారిలో ఈ ఏడాది అసాధారణ రీతిలో వర్షాలు కురిశాయి. దీంతో నేల కింద ఎన్నో ఏళ్లుగా నిద్రావస్థలో ఉన్న విత్తనాలు, దుంపలు మళ్లీ మొలకెత్తాయి. దీంతో ఉత్తర చిలీలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు ఊదా, తెలుపు రంగు పూలతో దర్శనమిస్తున్నాయి. ఈ సహజ దృశ్యాలను ‘డెసియెర్టో ఫ్లోరిడో (Flowering Desert) అని పిలుస్తారు.

ఈ ఏడాది అసాధారణ వర్షాలు:

సాధారణంగా ఎంతో పొడిగా ఉండే అటకామా ఎడారిలో ఈసారి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎల్ నినో దీనికి ఒక కారణమని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 180 మిల్లీమీటర్లకు పైగా నమోదైంది. అటకామా వంటి ప్రాంతాల్లో ఇది అసాధారణం. భారీ వర్షాలు కరవడంతో నేల లోపల ఉన్న విత్తనాలకు తేమ లభించడంతో మొలకెత్తాయి. దాదాపు 200 రకాల మొక్కల విత్తనాలు, భూగర్భ దుంపలు చాలా కాలం పాలు నిద్రావస్థలో ఉండగలవు. సరైన సమయంలో వర్షం లభిస్తే మొలకెత్తుతాయి.

అక్టోబర్‌లో పూల పండగ..

వర్షాల తర్వాత పూలు మాత్రమే కాదు, ఎడారిలో జీవ వైవిధ్యం కూడా మారుతోంది. పొప్పొడి సేకరించేందుకు తేనెటీగలు, ఇతర కీలకాలు, వాటిపై ఆధారపడే పక్షులు, సరీసృపాలు కనిపిస్తున్నాయి. చిలీ నేషనల్ ఫారెస్ట్ కార్పొరేషన్ CONAF అంచనాల ప్రకారం ఈసారి అక్టోబర్ నెలలో పూలు వికసించడం గరిష్టస్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పింది. వీటిని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు రానున్నారు.