
రోజువారీ కూలినాలి చేసుకునే సాధారణ కుటుంబానికి పూట గడవడమే ఇప్పుడు పెద్ద గగనమైపోతోంది. మార్కెట్‌లోకి వెళ్లి సరుకులు కొందామంటే కిరాణా బిల్లు చూసి మైండ్ బ్లాకైపోయే పరిస్థితి వచ్చింది. దేశంలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ భారం మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఎల్‌నినో వల్ల ఏర్పడే వాతావరణ మార్పుల భయాలు సామాన్యులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అసలే అధిక ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న జనంపై దీని ప్రభావం కూడా పడితే బతుకు బండి లాగడం కష్టమే అంటున్నారు ప్రజలు.
బియ్యం, కందిపప్పు ధరల వాత..
ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి హోల్‌సేల్ మార్కెట్‌లో బియ్యం ధర ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు 8.5% పెరిగి క్వింటాల్ రూ.4వేల 185కి చేరింది. ఇక సామాన్యుడు రోజువారీ వంటలో విరివిగా వాడే కందిపప్పు ధర కేజీ రూ.125 దాటేసింది. మినపప్పు సహా ఇతర పప్పు దినుసులు కూడా అవే బాటలో దూసుకుపోతున్నాయ్. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే.. రాబోయే కాలంలో రేట్లు సామాన్యుడికి చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ముంచెత్తుతున్న ఎల్ నినో ముప్పు..
2026 చివరి నాటికి ‘ఎల్‌నినో’ ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇది వర్షపాతాన్ని దెబ్బతీసి, దేశంలో పంట దిగుబడిని భారీగా తగ్గించే ప్రమాదం ఉంది. దేశ జనాభాలో సగానికి పైగా ఆధారపడే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడితే.. తిండి గింజల ఉత్పత్తి పడిపోయి ధరలు అగ్గి మీద గుగ్గిలంలా పెరుగుతాయ్. అయితే ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద తగినంత ఆహార నిల్వలు, ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు ఉండటం ఒక్కటే ప్రస్తుతం కాస్త ఊరటనిచ్చే అంశం.
వంటనూనెలపై ప్రభుత్వ చర్యలు..
పండుగలు దగ్గర పడుతున్న వేళ వంటనూనెల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. భారత్ తన వంటనూనె అవసరాల కోసం భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్‌ను బయోడీజిల్ తయారీకి ఎక్కువగా మళ్లిస్తుండటంతో ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. దీనిని ముందే గమనించిన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల ముడి సోయాబీన్, పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10% నుంచి 5%కి తగ్గించింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని ఏకంగా సున్నాకి కుదించింది. దీనివల్ల రీటైల్ మార్కెట్లో నూనె ధరలు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.