Reading Time: 2 minutes
Sigma Movie Review Sundeep Kishan Jason Sanjay Lyca Productions

తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎంవిజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో రూపొందడంతో సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి దర్శకుడిగా తొలి ప్రయత్నంలో జేసన్ సంజయ్ మెప్పించారా? సందీప్ కిషన్‌కు ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టిందా? పూర్తి వివరాలు చూద్దాం.

సిగ్మా కథ
గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ నడుపుతుంటాడు. అయితే ఆర్థికంగా తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన అతడిని అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుంటారు. ఎలాగైనా ఆ అప్పుల ఊబి నుంచి బయటపడాలని గురు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.ఇంకోపక్క క్యాసినో, డ్రగ్స్ మాఫియాతో వేల కోట్లు గడించే వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్), విన్సెంట్ అనే ఇద్దరు భాగస్వాముల మధ్య వివాదం చెలరేగుతుంది. సుమారు ₹1000 కోట్ల నగదున్న ఒక రహస్య కంటైనర్‌ను తెరిచే కీలకమైన ‘కీ’ మరియు పెన్ డ్రైవ్ విన్సెంట్ వద్ద ఉండిపోతాయి. పోలీస్ దాడి నుంచి వీరయ్య రెడ్డి తప్పించుకోవడంతో, ఆ కంటైనర్ కీ కోసం వెతుకులాట మొదలవుతుంది. అనుకోకుండా ఈ భారీ మొత్తం గురించి సమాచారం తెలుసుకున్న గురు.. తన స్నేహితులు సామ్ (ఫరియా అబ్దుల్లా), డాక్టర్ (రాజు సుందరం)లతో కలిసి ఆ సొమ్మును దక్కించుకోవడానికి ఒక ప్రణాళిక వేస్తాడు. ఆ తర్వాత మాఫియా, గురు బృందం మధ్య ఎలాంటి ఎత్తుకు పైఎత్తులు నడిచాయి? చివరకు ఆ భారీ సొమ్ము ఎవరి చేతికి చేరిందనేది మిగతా కథ.

విశ్లేషణ
సినిమా మూల కథ క్రైమ్-మనీ హీస్ట్ చుట్టూ తిరిగే ఓ సాధారణ థ్రిల్లర్ పాయింట్. అయితే, ఒక ఆసక్తికరమైన పాయింట్‌ను తెరపై నడిపించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథ ప్రారంభంలో పాత్రల పరిచయం కొంతవరకు పరవాలేదనిపించినా, కథ ముందుకు సాగేకొద్దీ స్పష్టత కొరవడింది. అనవసరమైన పాత్రల ప్రవేశం, అతిగా సాగదీసిన ప్రేమాయణం, సిల్లీగా అనిపించే బ్లాక్‌మెయిలింగ్ సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. విలన్ల నుంచి తప్పించుకోవడం, హీరో డబ్బు డిమాండ్ చేయడం వంటి సన్నివేశాల్లో ఎలాంటి కొత్తదనం కానీఇంటెన్సిటీ లేదా థ్రిల్ కనిపించదు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సహనాన్ని పరీక్షించేలా సాగగా, సెకండ్ హాఫ్ లో ఆ గందరగోళం మరింత పెరిగిపోయింది. సన్నివేశాల మధ్య సరైన ముగింపు లేకుండా లాజిక్‌లను పూర్తిగా గాలికొదిలేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ చిత్రాలకు ప్రాణమైన ఉత్కంఠ, డ్రామా ఎక్కడా వర్కవుట్ కాలేదు.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే సందీప్ కిషన్:గురు పాత్రలో నటించడానికి తీవ్రంగా శ్రమించాడు. అయితే సన్నివేశాల్లో బలం లేకపోవడం, కొన్ని చోట్ల ఓవర్ డ్రామాగా అనిపించడంతో ఆయన పాత్ర తేలిపోయింది. యాక్షన్ సన్నివేశాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. ఫరియా అబ్దుల్లా:సామ్ పాత్రలో తన పరిధి మేరకు నటించింది. సంపత్ రాజ్:మాఫియా డాన్ వీరయ్య రెడ్డిగా ఎప్పటిలాగే అనుభవంతో కూడిన నటనను కనబరిచారు. రాజు సుందరం పోషించిన డాక్టర్ పాత్ర ఏమాత్రం హాస్యాన్ని పంచలేకపోయింది. సందీప్ కిషన్ స్నేహితుడిగా నటించిన నటుడు, మిగతా సహాయ నటులు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం (RR) కొన్ని మూమెంట్స్‌లో బాగున్నా, సన్నివేశాల్లో పట్టు లేకపోవడంతో ఆ ప్రభావం ఎక్కువసేపు నిలవలేదు. విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ చాలా వీక్‌గా ఉంది. సినిమాలో ల్యాగ్ సీన్లు, అనవసర సన్నివేశాలను కత్తెరించడంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.లైకా ప్రొడక్షన్స్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో రిచ్‌గా నిర్మించారు.జేసన్ సంజయ్ ఎంచుకున్న లైన్ కన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే అసలు లోపం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్లలో ఉండాల్సిన పకడ్బందీ స్క్రీన్‌ప్లేను రాసుకోవడంలో విఫలమయ్యారు.

చివరిగా ‘సిగ్మా’ రొటీన్ అండ్ బోరింగ్ హీస్ట్ డ్రామా