Reading Time: < 1 minute

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..జీతాల కోసం బ్యాంకుల నుంచి అప్పులు

Caption of Image.
  • రూ. 70 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ప్రశ్నార్థకంగా సంస్థ మనుగడ
  • నస్పూర్ లో సింగరేణి బకాయిలపై బీజేపీ లడాయి కార్యక్రమం

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి సుమారు రూ.70 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో సింగరేణి జీతాల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

సింగరేణి బకాయిలపై బీజేపీ లడాయి ధర్నా కార్యక్రమాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియా సీసీసీ నస్పూర్​కార్నర్​వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘునాథ్​వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గతంలో కేసీఆర్​, ఇప్పుడు సీఎం రేవంత్​రెడ్డి విఫలం అయ్యారన్నారు. సింగరేణికి బీఆర్ ఎస్ హయాంలో రూ.28 వేల కోట్ల బకాయిలు ఉంటే.. కాంగ్రెస్​సర్కార్​ రూ.55వేల కోట్లకు పెంచిందన్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.70 వేల కోట్లకు చేరడంతో సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 

2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి, 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్​చేశారు. ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని, సొంతింటి పథకంలో భాగంగా రెండు గుంటల జాగ, బ్యాంక్​లోన్ ఇప్పించాలని, కార్మికులకు నాణ్యమైన పనిముట్లు, సేఫ్టీ పరికరాలను ఇవ్వాలని కోరారు. 

ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, బోడిగె శోభ, అందుగుల శ్రీనివాస్, హేమాజీ, సంధ్యారాణి, నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్​గౌడ్​, ముఖేశ్​గౌడ్, గోమాస శ్రీనివాస్, బీఎంఎస్ స్టేట్​ప్రెసిడెంట్​అప్పాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.