
హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో బుధవారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఆయన ఓటమి ఖాయమని ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన కేటీఆర్‌ను రాజకీయంగా తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టేసిందని వేముల వీరేశం ఎద్దేవా చేశారు. సీఎం సంధించిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పలేక కేటీఆర్ కేవలం సొల్లు కబుర్లు చెప్పారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ముసుగులో వ్యాపారాలు చేసుకున్నానని స్వయంగా కేటీఆరే అంగీకరించారని, తనకు మూడు హోటళ్లు ఉన్నాయని ఒప్పుకోవడంతో ఆయన అసలు ముసుగు పూర్తిగా తొలగిపోయిందని వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శించారు.