
India vs West Indies: గువాహటిలోని బార్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1971లో మొదలైన వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఏకంగా 5,023 మ్యాచ్‌లు జరగ్గా, ఈ 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఎప్పుడూ చూడని ఒక అరుదైన వింత గువాహటి ఫ్లాట్ పిచ్‌పై ఆవిష్కృతమైంది. ఒకే వన్డే మ్యాచ్‌లో రెండు జట్ల నుంచి కలిపి ఏకంగా 5 సెంచరీలు నమోదు కావడం క్రికెట్ చరిత్రలోనే ఇది మొదటిసారి.
ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకు బ్యాటర్లదే హవా నడిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ 101 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడితే, కెప్టెన్ షాయ్ హోప్ 104 పరుగులతో రాణించాడు. ఇక యువ బ్యాటర్ అమీర్ జంగూ 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరి ముగ్గురి విధ్వంసకర శతకాల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ రికార్డు స్కోరు సాధించింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నుంచి కూడా ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 75 బంతుల్లోనే 101 పరుగులు చేసి ఆతిథ్య జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అడుగు ముందుకేసి 133 బంతుల్లో ఏకంగా 223 పరుగులతో చారిత్రాత్మక డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇలా ఇరు జట్ల నుంచి కలిపి మొత్తం ఐదుగురు బ్యాటర్లు వంద లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడంతో ఈ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, అంతటి భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేయడం విశేషం. ఇది వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ రన్ ఛేజ్‌గా నిలిచింది.
వాస్తవానికి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 4 సెంచరీలు నమోదవడమే పెద్ద రికార్డుగా ఉండేది. 5,023 మ్యాచ్‌ల చరిత్రలో అలా 4 సెంచరీలు నమోదైన సందర్భాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. 1998లో లాహోర్‌లో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అమీర్ సోహెల్, మహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్), ఆడమ్ గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) సెంచరీలు చేశారు. ఆ తర్వాత 2013 నాగపూర్ వన్డేలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో షేన్ వాట్సన్, జార్జ్ బెయిలీ (ఆస్ట్రేలియా), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (భారత్) శతకాలు బాదారు. ఇక మూడోసారి 2023లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ (శ్రీలంక), అబ్దుల్లా షఫీక్, మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) సెంచరీలు కొట్టారు. కానీ, గువాహటి మ్యాచ్ మాత్రం ఈ పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి, ఏకంగా 5 సెంచరీలతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చరిత్ర పుటల్లోకెక్కింది.