
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విన్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విన్నాం. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చూశాం. టెక్నాలజీ కోసం, వ్యాపారం కోసం, పారిశ్రామిక రంగం కోసం ఇవే దేశంలోని హైఫై స్కూళ్లు. కానీ ఇలాంటిది వ్యవసాయానికి ఉంటే ఎలా ఉంటుంది.. ! ఉంటుంది కాదు.. ఫస్ట్ టైమ్ ఒకటి రాబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో.! దానిపేరే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్! మదనపల్లెలో దేశంలోనే ఫస్ట్‌టైమ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కి సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తో కలిసి.. సీఎం శంకుస్థాపన చేశారు. మదనపల్లె సభలో అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని అనంత్ అంబానీ కోరారు. ISAకి రిలయన్స్ అన్ని రకాల సపోర్ట్ ఇస్తుందన్నారు. బలమైన గ్రామీణ వ్యవస్థకు పునాదులు వేస్తున్నామని అనంత్ అంబానీ పేర్కొన్నారు.
రిలయన్స్ సహకారంతో మదనపల్లెలో దాదాపు వంద ఎకరాల్లో దీని నిర్మాణం జరగబోతోంది. భవిష్యత్‌లో ఇదే వ్యవసాయ ఆవిష్కరణలకు కేంద్రంగా.. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారబోతోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఆధునిక, సాంకేతిక అంశాలకు ఈ స్కూల్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య విశ్వవిద్యాలయాల్లో కొనసాగే కోర్సులకు ఇంకాస్త భిన్నంగా ISA ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనం, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై శిక్షణ, సలహాలు అందిస్తారు. డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను, ఇంక్యుబేషన్ కేంద్రాలను కూడా ఐఎస్ఏ అభివృద్ధి చేస్తుంది. ఇక ఆహారశుద్ధి, రవాణా, అగ్రిటెక్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా ISA సాయం చేస్తుంది. అంటే.. ఏ నేలలో ఏ పంట ఎలా పండించాలి. ఏ పంటకు ఎలాంటి సాంకేతికతో ముందుకెళ్లాలి.. పంట విషయంలో వాతావరణ మార్పులు, పంట పండిన తర్వాత మార్కెటింగ్ విషయాలు.. ఇలా ఒక్కటేంటి సాగుకు సంబంధించి నేల, విత్తనాల నుంచి దిగబడి, ఆదాయం వరకూ అంతా ISA చూసుకుంటుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ దీనికి భాగస్వామిగా వ్యవహరిస్తుంది. స్టార్టప్, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లను ఏర్పాటు చేస్తుంది. జాన్‌డీర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, నెస్లే తదితర అంతర్జాతీయ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.