
- రౌడీషీట్ ఓపెన్ చేయడంతో దుబాయ్‌కి పరార్
- వారం కిందట సిటీకి..కాపుకాసి పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: 35 ఏండ్లకుపైగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ (అవుట్ ఆఫ్ వ్యూ) రౌడీషీటర్‌ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలా బర్కాస్ ప్రాంతానికి చెందిన ఇల్యాస్ బిన్ హుస్సేన్ యాపై (54)1991లో హత్యాయత్నం కేసు నమోదైంది. రౌడీషీట్ ఓపెన్ చేయడంతో అప్పటి నుంచి నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మొదట్లో దుబాయ్‌కు వెళ్లాడు.
తిరిగి ఇండియాకు వచ్చినా హైదరాబాద్‌కు రాకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ, వాల్ పెయింటింగ్ పనులు చేస్తూ తలదాచుకున్నాడు. అయితే హుస్సేన్ వారం కిందట చాంద్రాయణగుట్టలోని సలాల బర్కాస్ కు వచ్చినట్లు పోలీసులకు ఇన్‌ఫర్మేషన్ అందింది. నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ చార్మినార్ జోన్ బృందం, చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి ఈనెల 28న కేశవగిరి లేబర్ అడ్డాలో చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్‌ను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు పర్యవేక్షణలో నిర్వహించారు. ఎస్సైలు కే. రామారావు, ఎం. మహేశ్, ఎం. మధు, పీసీ టి. ప్రశాంత్ కీలక పాత్ర పోషించినట్లు చార్మినార్, గోల్కొండ జోన్ ఇన్‌చార్జ్ అదనపు డీసీపీ కేఎస్ రావు తెలిపారు.