Reading Time: 2 minutes
National Pension Scheme Traders Shopkeepers Self Employed 3000 Pension

Traders Pension Scheme: చిన్న వ్యాపారులు, సొంతంగా ఏదో ఒక పని చేసుకునే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వ్యక్తులకి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిని విస్తరిస్తూ, ప్రత్యేకంగా వ్యాపారులు, దుకాణదారుల కోసం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉద్యోగులకు EPFO ద్వారా పెన్షన్ సౌకర్యం ఉంటుంది. కానీ ఎలాంటి అధికారిక రిటైర్మెంట్ పెన్షన్ పరిధిలోకి రాని అసంఘటిత రంగంలోని వారికి, చిన్న వర్తకులకు వృద్ధాప్యంలో ఎవరిమీదా ఆధారపడకుండా ఉండటానికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే అర్హులైన వ్యాపారులంతా వెంటనే ఇందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది.

ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే..?

60 ఏళ్ల వయసు నిండిన తర్వాత లబ్ధిదారులకు ప్రతినెల రూ. 3,000 చొప్పున, అంటే ఏడాదికి రూ. 36,000 కచ్చితమైన గ్యారెంటీ పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇది భాగస్వామ్య ప్రాతిపదికన నడుస్తుంది. అంటే లబ్ధిదారుడు నెలకు ఎంత మొత్తం డిపాజిట్ చేస్తారో, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకంలో చేరే వ్యక్తి వయస్సును బట్టి మనం చెల్లించాల్సిన నెలవారీ విరాళం రూ. 55 నుంచి రూ. 200 వరకు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు తక్కువ వయసులోనే చేరితే కేవలం రూ. 55 కడితే సరిపోతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే, ఆ తర్వాత జీవితాంతం ప్రతినెల రూ. 3,000 అస్యూర్డ్ పెన్షన్ అందుకోవచ్చు.

ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరడం కూడా చాలా సులభం. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్తే అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డ్, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరే సొంతంగా చేసుకోవాలనుకుంటే ఈ పథకం అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి సెల్ఫ్-ఎన్‌రోల్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. అధికారిక గణాంకాల ప్రకారం 2025 నవంబర్ 26 నాటికి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో సుమారు 60,538 మంది వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు నమోదయ్యారు. అసంఘటిత రంగానికి చెందిన చిన్న వ్యాపారులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇలాంటి పొదుపు పథకాలపై అవగాహన పెంచుకుని మీ పెట్టుబడులను పెంచుకోవడాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.