Reading Time: < 1 minute

మెగా ఆయిల్‌‌‌‌ ప్యాకింగ్‌‌ స్టేషన్‌‌ ప్రారంభం 

Caption of Image.

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (టీజీ ఆయిల్‌‌ఫెడ్‌‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌ శివరాంపల్లి, రాజేంద్రనగర్‌‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ముఖ్య అతిథులుగా హాజరై విజయ ఆయిల్స్‌‌ మెగా ఆయిల్‌‌ ప్యాకింగ్‌‌ స్టేషన్‌‌, విజయ వర్షి మినరల్‌‌ వాటర్‌‌ ప్లాంట్లను ప్రారంభిస్తారు.

ఇదే వేదికపై విజయ్‌‌ వంట నూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మెగా ప్యాకింగ్‌‌‌‌ స్టేషన్‌‌ అత్యాధునిక రోబోటిక్‌‌, ఆటోమేటెడ్‌‌ సాంకేతికతతో నడుస్తుంది. దీని ద్వారా రోజుకు 200 టన్నులు, నెలకు 5,000 టన్నుల నూనెను ప్యాకింగ్‌‌ చేయవచ్చు. పౌచ్‌‌లు, టిన్లు, జార్లలో ప్యాకింగ్‌‌ చేసేందుకు ఈ సదుపాయం కల్పించారు. మానవ ప్రమేయం తగ్గడం వల్ల ప్యాకింగ్‌‌ వేగం, నాణ్యత మరింత మెరుగుపడనున్నాయి.

ఆధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విజయ వర్షి మినరల్‌‌ వాటర్‌‌ ప్లాంట్ల ద్వారా నాణ్యమైన ప్యాకేజ్డ్‌‌ డ్రింకింగ్‌‌ వాటర్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టే విజయ్‌‌ వంట నూనెల విక్రయ కేంద్రం ద్వారా వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను అందించడంతో పాటు పంపిణీ వ్యవస్థ బలోపేతం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌‌కు తగినట్లుగా సరఫరాను విస్తరించేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.