
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2026 సెప్టెంబర్ 30వ తేదీన భారీగా కొకైన్ పట్టుకున్నారు అధికారులు. దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర కొకైన్ ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పక్కా సమాచారం అందింది. సమాచారం ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగేజీని అధికారులు తనిఖీ చేసి వ్యక్తిని పట్టుకున్నారు.
క్యాబిన్ బ్యాగేజీలో ఏడు లిండ్ట్ లీడర్ అసార్టెడ్ బిల్ట్ డార్క్ చాక్లెట్ సెలెక్షన్ ట్యూబ్‌లు గుర్తించారు అధికారులు. ట్యూబ్‌లను పరిశీలించగా.. చాక్లెట్లతో పాటు 207 లేత పసుపు రంగు అండాకారపు క్యాప్సూల్స్ బయటపడ్డాయి. క్యాప్సూల్స్‌లో ఉన్న తెల్లటి పొడి పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించగా.. అది కొకైన్‌గా నిర్ధారణ అయింది.
►ALSO READ | సైబర్ స్కాం కాదు అంతకు మించి.. రూ. రెండు కోట్ల ఇల్లు, నగలు, దోచుకున్నారు..! వృద్ధురాలి జీవితకాలం సంపాదన
మొత్తం 4.9 కిలోల కొకైన్‌ను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కొకైన్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలించాల్సి ఉంది, ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.