
Harbhajan Singh Praises Shubman Gill: భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. గువాహటిలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ 133 బంతుల్లోనే 223 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌పై మాజీ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు.
హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘కాలం గడిచేకొద్దీ శుభ్‌మన్ గిల్ ఆట మరింత మెరుగవుతోంది. అండర్-19 రోజుల నుంచి గిల్ ఆటను గమనిస్తున్నా. అనుభవం పెరిగిన కొద్దీ అతడి బ్యాటింగ్‌లో మరింత పరిణతి కనిపిస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గిల్ సాధించిన విజయాల వెనుక అతడి కష్టంతో పాటు తండ్రి పాత్ర కూడా ఎంతో ఉంది. ఇంత చిన్న వయసులోనే గిల్ సాధిస్తున్న ఘనతలు గర్వంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంత వేగంగా డబుల్ సెంచరీ సాధించడం అసాధారణం. గిల్‌కు, అతడి తండ్రికి అభినందనలు’ చెప్పారు.
వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ కేవలం 117 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. బంగ్లాదేశ్‌పై 2022లో ఇషాన్ 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాత గిల్ రెండో ఆటగాడిగా నిలిచాడు. గిల్ 2023లో న్యూజిలాండ్‌పై 208 పరుగులతో తొలి వన్డే డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై 223 పరుగులతో రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేకాకుండా విజయవంతమైన వన్డే ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ విషయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మ్యాక్స్‌వెల్ 2023 వన్డే ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్‌పై 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. గత ఏడాది ఇంగ్లండ్‌పై ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ 269 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించడంతో ఈ ప్రత్యేక ఘనత అతడి సొంతమైంది.
వెస్టిండీస్‌పై 223 పరుగులతో శుభ్‌మన్ గిల్.. భారత కెప్టెన్‌గా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్‌పైనే 219 పరుగులు చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 894 పరుగులు చేశాడు. 127.71 సగటుతో పాటు 119.51 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు బాదాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 69 వన్డేల్లో 68 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. 3,712 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 11 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి.