
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సమస్యలకు నిలయంగా సిరిసిల్లను మార్చేశారని ధ్వజమెత్తారు. బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..‘‘ దైవం, ధైర్యం కలిసిన ప్రాంతం సిరిసిల్ల. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం. చేనేత కార్మికులకు, వృత్తి నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరు. అగ్గిపెట్టె చీరతో సిరిసిల్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు నేతన్నలు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి నిలబెట్టాడు. ఆనాడు కేటీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయినట్లు సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించింది. కాళేశ్వరం కట్టి కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టారు. మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరెళ్ల దళితులను ఇసుక లారీలతో తొక్కించింది నిజమా కాదా.. దళిత బిడ్డలను పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టలేదా..?
గల్ఫ్ వలసలను పదేండ్లలో కేసీఆర్ ఎందుకు ఆపలేకపోయారు. గల్ఫ్ లో కార్మికులు చనిపోతే కనీసం వారి మృతదేహాలు స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదు. పదేండ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ కుటుంబం గల్ఫ్ బాధితుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం చేస్తున్నాం’’ అని చెప్పారు.