Reading Time: 2 minutes
India Vs Pakistan How They Could Face Each Other 3 Times In 2027 Odi World Cup

2027 ODI World Cup IND vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ 2027 షెడ్యూల్‌ విడుదలైంది. ప్రధాన టోర్నీ అక్టోబరు 7న ఆరంభం కానుండగా.. ఫైనల్‌ నవంబరు 21న జరుగుతుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌ గ్రూప్‌-ఏలో ఉన్నాయి. క్వాలిఫయర్‌-ఏ నుంచి మరో జట్టు ఈ గ్రూపులో చేరనుంది.

గ్రూప్‌ దశలో తొలి పోరు:

భారత్‌ అక్టోబర్‌ 7న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో ప్రపంచ కప్‌ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 10న జోహన్నెస్‌బర్గ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే 2027 ప్రపంచ కప్‌ ఫార్మాట్‌ కారణంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే టోర్నీలో ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 10న గ్రూప్‌-ఏలో భాగంగా జరగనుంది. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర జట్లతో తలపడుతుంది. ఈ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్‌లోని టాప్‌-3 జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన రికార్డు ఉన్న జట్టుకు కూడా సూపర్‌-7లో చోటు లభిస్తుంది.

సూపర్‌-7లో మరోసారి:
గ్రూప్‌ దశ తర్వాత సూపర్‌-7 దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఏడు జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఆడతాయి. గ్రూప్‌ దశలో సాధించిన పాయింట్లు సూపర్‌-7కు బదిలీ కావు. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 14 వరకు జరిగే ఈ దశలో ప్రతి జట్టు మరో ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్‌-7కు అర్హత సాధిస్తే.. ఇక్కడ కూడా ఒకసారి తలపడే అవకాశం ఉంటుంది.

సెమీస్‌ లేదా ఫైనల్లో మూడోసారి:
సూపర్‌-7 దశ ముగిసిన తర్వాత టాప్‌-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత్, పాకిస్థాన్ రెండు జట్లు టాప్‌-4లో నిలిస్తే.. సెమీఫైనల్‌లో లేదా ఫైనల్లో మరోసారి ముఖాముఖి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రెండు జట్లు టోర్నీలో గరిష్ఠంగా మూడు సార్లు తలపడే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుత ఫార్మాట్‌ ప్రకారం.. గ్రూప్‌ దశ, సూపర్‌-7 దశ, ఆ తర్వాత నాకౌట్‌ దశలో భారత్‌-పాకిస్థాన్‌ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మూడు మ్యాచ్‌లు జరగాలంటే రెండు జట్లు ఆయా దశలకు అర్హత సాధించాల్సి ఉంటుంది.

విశ్వవిజేతగా నిలవాలని:
2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ సాధించింది. ఈసారి విశ్వవిజేతగా నిలవాలని టీమిండియా చూస్తోంది. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మీ టోర్నీలో ఆడనున్నారు. పాకిస్థాన్‌ మాత్రం 2023 ప్రపంచ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఐదు ఓటములతో ఐదో స్థానంలో నిలిచింది. 2023 ప్రపంచ కప్‌లో 10 జట్లు పాల్గొనగా.. 2027 టోర్నీలో 12 జట్లు బరిలోకి దిగనున్నాయి.