
Khairatabad Bypoll : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టుకు కీలక విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది పరిష్కారం లభించే వరకు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియపై విచారణ తేలేంత వరకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
దానం నాగేందర్ అనర్హతతో ఖాళీ అయిన స్థానం
శాసనసభ్యుడిగా ఉన్న దానం నాగేందర్ అనర్హతకు గురైన నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. దీంతో నిబంధనల ప్రకారం ఈ స్థానానికి ఆరు నెలల వ్యవధిలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేసింది.
విజయారెడ్డి పిటిషన్‌పై విచారణ.. కోర్టు నిర్ణయమే కీలకం
గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ పిటిషన్‌పై తుది పరిష్కారం అయ్యేంత వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఈసీఐ నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో జరగనున్న తదుపరి విచారణలో న్యాయస్థానం తీసుకునే నిర్ణయమే ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో అత్యంత కీలకంగా మారనుంది.