
PM Modi: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఊహించని ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన ధైర్యాన్ని కొనియాడిన మోడీ, ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ప్రాణాపాయ స్థితిలో కూడా వెనుకాడకుండా ఇతరుల ప్రాణాలను కాపాడాలనే ఆయన నిశ్చయం అద్భుతమని, స్మిత్ చేసిన సాహసమే పెద్ద ప్రమాదాన్ని తప్పించి వందలాది మంది ప్రాణాలను నిలిపిందని కొనియాడారు. స్మిత్ త్వరగా కోలుకుని పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయనను చూసి భారత్ ఎంతో గర్విస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
అసలు ఆకాశంలో ఏం జరిగిందంటే..?
ఫ్లైదుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 (FZ1073) విమానం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. అయితే విమానం ప్రయాణంలో ఉండగా కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య అనూహ్యంగా గొడవ మొదలైంది. ఒక పైలట్ చేతిలో కత్తి ఉందని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపగా, కో-పైలటే కెప్టెన్‌పై కత్తితో దాడి చేశాడని, ఆ వెంటనే క్యాబిన్ సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించారని రాయిటర్స్ పేర్కొంది. ఒక పైలట్ మరొకరిపై దాడి చేసి విమానాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా వెల్లడించారు. ఇక ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దుబాయ్ నుంచి బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత విమానం నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. కేవలం ఒక్క నిమిషంలోనే విమానం 33,000 అడుగుల ఎత్తు నుంచి ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోతూ, జోర్డాన్ సరిహద్దు వద్ద అటు ఇటుగా విచిత్రమైన మలుపులు తిరిగింది.
గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో గొడవ జరిగిన మాట వాస్తవమేనని, ప్రయాణికులు సురక్షితంగా తబూక్‌లో ల్యాండ్ అయ్యారని ఫ్లైదుబాయ్ సంస్థ ధ్రువీకరించింది. దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌తో పాటు ఫస్ట్ ఆఫీసర్‌ను కూడా వెంటనే తబూక్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సౌదీ స్టేట్ టెలివిజన్ తెలిపింది. అసలు కాక్‌పిట్‌లో ఈ దారుణమైన గొడవ ఎందుకు జరిగింది, విమానాన్ని కూల్చేసేంత పరిస్థితి ఎందుకొచ్చింది అనే విషయాలపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.