
సుమంత్, ఐశ్వర్యారాజేష్ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్‌కు మిశ్రమ స్పందన లభించింది. థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఐశ్వర్యా రాజేష్, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, మంజు భార్గవి, కమల్ కామరాజు, వంశీ చాగంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మించారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరి రాజవంశాన్ని 200 ఏళ్లుగా వెంటాడుతున్న ఓ భయంకరమైన శాపం కథకు కేంద్రబిందువు. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజునే చనిపోతుంటాడు. 1993లో జన్మించిన రాజేంద్ర వర్మ మరణంతో మొదలయ్యే ఈ మిస్టరీ.. ఆ తర్వాత మరో వారసుడి ప్రాణాలపైకి వస్తుంది.
మరోవైపు దెయ్యాలు, దేవుళ్ల పేరుతో జరుగుతున్న మోసాలను ఆధారాలతో బయటపెట్టే యూట్యూబర్ సిద్ధార్థ్‌గా సుమంత్ కనిపిస్తాడు. దేవుడిని నమ్మే తన అన్న రాజీవ్ అనూహ్యంగా 33వ పుట్టినరోజున మహేంద్రగిరి ఆలయం వద్ద చనిపోవడంతో.. ఈ మరణం వెనుక అసలు రహస్యాన్ని ఛేదించేందుకు సిద్ధార్థ్ రంగంలోకి దిగుతాడు.
ALSO READ : పెయిడ్ ప్రీమియర్స్ లేవు.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ!
ఇది నిజంగా అమ్మవారి శాపమా? 200 ఏళ్ల నాటి రహస్యం ఏమిటి? వరుస మరణాల వెనుక అతీంద్రియ శక్తులున్నాయా.. లేక మనుషుల కుట్రా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘మహేంద్రగిరి వారాహి’ అసలు కథ. థియేటర్లలో మిస్ చేసిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో ఈ మిస్టరీని ఇంట్లోనే చూసే అవకాశం దక్కింది..