Fixed Deposit Rules Change: అక్టోబర్ 1 నుంచి ఆర్బిఐ కొత్త ఎఫ్డి నిబంధనలు తీసుకువచ్చింది. ఆర్బిఐ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, వాణిజ్య బ్యాంకులలో బల్క్ డిపాజిట్లు అంటే సాధారణంగా రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న టర్మ్ డిపాజిట్లపై మార్పులు చేసింది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు వడ్డీ రేట్లను వెల్లడించే విధానం మారనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బల్క్ డిపాజిట్ల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. బ్యాంకులు ఇకపై ప్రతి పనిదినం తమ వెబ్సైట్లలో అటువంటి డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను వెల్లడించాల్సి ఉంటుంది.
బల్క్ డిపాజిట్లు అంటే ఏమిటి?: కమర్షియల్ బ్యాంకుల్లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో వేసే టర్మ్/ఫిక్స్డ్ డిపాజిట్లను ‘బల్క్ డిపాజిట్లు’ అంటారు. కొత్త మార్పులు ఏంటో తెలుసుకుందాం.. రోజువారీ వడ్డీ రేట్ల ప్రకటన: బ్యాంకులు తమ వెబ్సైట్లలో ప్రతి పనిదినం ఉదయం 10 గంటలకల్లా బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రచురించాలి (అప్డేట్ కోసం 10 నిమిషాల సమయం ఉంటుంది). ఇక ఒకే రకమైన వడ్డీ రేటు ఉంటాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా డిపాజిట్ చేసినా ఒకే రోజు చేసే సమానమైన బల్క్ డిపాజిట్లకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంకులు తమ వెబ్సైట్లో ముందుగా ప్రకటించిన వడ్డీ రేటునే కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.
బ్యాంకులకు ఇంకా భిన్నమైన వడ్డీ రేట్లు ఇచ్చే వెసులుబాటు ఉందా? లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఫ్రేమ్‌వర్క్ కింద డిపాజిట్ల లిక్విడిటీ లక్షణాలు మారినప్పుడు, బ్యాంకులు విభిన్న వడ్డీ రేట్లను ఆఫర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్ పారదర్శకంగా ఉండటమే ఈ కొత్త రూల్ ముఖ్య ఉద్దేశం.
సాధారణ (రిటైల్) ఎఫ్డీ పెట్టుబడిదారులపై ప్రభావం ఎంత?: సాధారణ ఎఫ్డీ పెట్టుబడిదారులకు (ఉదాహరణకు రూ. 1 లక్ష, రూ. 5 లక్షలు లేదా రూ. 25 లక్షలు డిపాజిట్ చేసేవారు) ఈ మార్పు వల్ల ఎటువంటి ప్రత్యక్ష ప్రభావం ఉండదు. ఈ నిబంధనలు కేవలం రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే పెద్ద పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి.
పెద్ద ఎఫ్డీ పెట్టుబడిదారులు ఏమి చేయాలి? రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసేవారు ఎఫ్డీ బుక్ చేసే ముందు బ్యాంకు అధికారిక వెబ్సైట్లో ఆ రోజు ప్రచురించిన వడ్డీ రేట్లను తనిఖీ చేయాలి. డిపాజిట్ చేసిన రోజున ప్రచురించిన వడ్డీ రేటు స్క్రీన్‌షాట్ లేదా రికార్డును భద్రపరుచుకోవడం మంచిది. బాండ్ లేదా డిపాజిట్ రశీదులోని వడ్డీ రేటు వెబ్సైట్లో పేర్కొన్న రేటుతో సరిపోలుతుందో లేదో సరిచూసుకోవాలి.




