
దేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మార్పులు తెచ్చిన యూపీఐ పేమెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీకి కేంద్రంగా మారాయి. మోడీ ప్రభుత్వం ఛార్జీల మోత దీనికి కారణం. చిన్న లావాదేవీల నుండి పెద్ద వ్యాపార లావాదేవీల వరకు అంతటా కీలకంగా మారిన యూపీఐ సేవలకు సంబంధించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధింపు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే FMCG డిస్ట్రిబ్యూషన్, రిటైల్ రంగానికి ఏకంగా రూ.9వేల కోట్ల వరకు భారీ వార్షిక ఆర్థిక భారం పడుతుందని ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికే అతి తక్కువ లాభాల మార్జిన్లతో నెట్టుకొస్తున్న రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఈ అదనపు భారం తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదిత ఎండీఆర్ ఛార్జీల వల్ల కలిగే నష్టాలను తెలిపేందుకు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపేందుకు గాను అక్టోబర్ 2వ తేదీన “నో యూపీఐ డే” పిలుపునకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐసీపీడీఎఫ్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల 50వేల మంది డిస్ట్రిబ్యూటర్లు, కోటి 30లక్షల మంది రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో లాభాల మార్జిన్లు 3.5 శాతం నుండి 6 శాతం మధ్యలో మాత్రమే ఉంటాయని.. కేటగిరీని బట్టి ఇవి మారుతుంటాయని ఐసీపీడీఎఫ్ వెల్లడించింది. ఈ తక్కువ మార్జిన్ల వ్యాపారంలో వినియోగదారుడు రిటైలర్‌కు చెల్లించే సమయంలోనూ.. మళ్లీ రిటైలర్ డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించే సమయంలోనూ ఇలా ఒకే అమ్మకపు సైకిల్‌లో 2 సార్లు యూపీఐ ఛార్జీలు వసూలు చేస్తే అది తమకు తలకు మించిన భారమవుతుందని జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ హెచ్. పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ చెల్లింపులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ సర్కార్ నిర్ణయంతో ఆర్థిక ప్రభావం చిన్న వ్యాపారుల ఉనికికే ముప్పు తెస్తుందని అన్నారు.
►ALSO READ | పాత ఇళ్లు, అపార్ట్మెంట్స్ కొంటున్నారా..? ఈ 7 విషయాలు చెక్ చేయకపోతే డబ్బులు గంగలో పోసినట్లే!
అంతేకాకుండా ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై MRP ముద్రించి ఉండటం వల్ల, పెరిగిన లావాదేవీల ఖర్చును రిటైలర్లు నేరుగా వినియోగదారులపై రుద్దడం అసాధ్యమని ఫెడరేషన్ గుర్తుచేసింది. వ్యాపారులు తమ సొంత ధరలను పెంచుకునే వెసులుబాటు లేనందున.. ఈ అదనపు ఛార్జీలు నేరుగా వారి నికర ఆదాయాన్ని ఆవిరి చేస్తుందని తెలిపింది. దీనికి తోడు ఎండీఆర్ పై పడే GST భారం వ్యాపారులకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది.
మొత్తానికి యూపీఐ ఛార్జీల వ్యవహారం కేవలం ఒక్కో లావాదేవీని మాత్రమే కాకుండా మొత్తం ఎఫ్‌ఎంసీజీ సరఫరా గొలుసుపై పడే ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఏఐసీపీడీఎఫ్ కోరుతోంది. ఎండీఆర్ ఛార్జీలు, పన్నులు, ప్రాసెసింగ్ ఖర్చులను సమగ్రంగా సమీక్షించి, తక్కువ మార్జిన్లతో బతుకుతున్న చిన్న వ్యాపారులను చంపే ప్రయత్నం మానుకోవాలని అన్నారు.