Reading Time: < 1 minute
Ooty Blood Donation Camp Caste Details In Form Spark Controversy

Blood Donation Camp: ప్రతి మనిషి శరీరంలో ప్రవహించేది రక్తమే.. ఎవరిని కోసినా రక్తమే వస్తుంది.. దానికి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేదు.. కొన్ని గ్రూపులు ఉండొచ్చు.. కానీ, కులాలు, మతాలు అనే తేడా లేకుండా అందరిలోనూ అవే గ్రూప్‌లు ఉంటాయి.. అలాంటి రక్తాన్నే కులాల వారీగా విభజించే ప్రయత్నం వివాదానికి దారితీసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో రక్తదాన శిబిరంలో కులం వివరాలు సేకరించడం కలకలం రేపింది.

ఊటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. దాతల వివరాలు నమోదు చేసే ఫారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ అంటూ ప్రత్యేక కాలమ్‌లు కనిపించాయి. దీనిపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫారాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది. రక్తదాన శిబిరానికి సహకరించిన ‘మేరా యువ భారత్’ నీలగిరి జిల్లా ఆర్గనైజర్ ఎస్. రంజిత్ కుమార్ ఆధ్వర్యంలోనే కుల వివరాలు సేకరించినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపాల్ జె. ఎబినేజర్ నీలగిరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాలకు చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించిన రంజిత్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉండగా.. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..