
ఒక వినూత్న ఆలోచన సమాజంలోని సమస్యకు పరిష్కారం చూపగలదన్న నమ్మకం ఉన్నప్పటికీ, ప్రారంభ పెట్టుబడి దొరక్క ఎందరో ప్రతిభావంతులు తమ స్వప్నాలను అటకెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతరం నేడు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న వేళ, మూలధన సమీకరణ ప్రక్రియే వ్యవస్థాపకులకు మొదటి అగ్నిపరీక్షగా మారుతోంది. అయితే నాణ్యమైన ఉత్పత్తి నమూనా, పక్కా కార్యాచరణ ప్రణాళిక, పారదర్శక వ్యాపార సూత్రాలు ఉన్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృత ఆర్థిక వనరులు, ప్రభుత్వ తోడ్పాటు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన సంస్కరణలు దేశంలో అంకుర పరిశ్రమల రూపురేఖలను సమూలంగా మార్చాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థ ఏర్పాటైన నాటి నుంచి గరిష్టంగా పదేళ్ల కాలపరిమితి వరకు, వార్షిక టర్నోవర్ రూ. 100 కోట్లకు మించనంత వరకు డీపీఐఐటీ (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) గుర్తింపు పొందిన స్టార్టప్‌గా కొనసాగే వెసులుబాటు ఉంది. గుర్తింపు పొందిన ఈ సంస్థలు సెక్షన్ 80-ఐఏసీ కింద తొలి పదేళ్ల వ్యవధిలో తమకు అనుకూలమైన ఏవైనా వరుస మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపును పొందవచ్చు.
ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌లో 50 శాతం రాయితీ
స్టార్టప్ రంగానికి సంకెళ్లుగా మారిన ‘ఏంజెల్ ట్యాక్స్’ (ఐటీ చట్టం సెక్షన్ 56(2)(viib) నిబంధనను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం పెట్టుబడుల రాకకు నూతన జవజీవాలు నింపింది. మేధోసంపత్తి హక్కుల పరిరక్షణలో భాగంగా పేటెంట్ దాఖలు ఫీజుపై 80 శాతం, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌లో 50 శాతం రాయితీలను కల్పించడంతోపాటు, వ్యాపారం నష్టాలబాట పడితే దివాలా చట్టం కింద కేవలం 90 రోజుల్లో సంస్థను మూసివేసే ‘ఫాస్ట్ ట్రాక్ ఎగ్జిట్’ విధానం అందుబాటులోకి వచ్చింది.
దక్షిణ భారతంలో స్టార్టప్ ఆవిష్కరణలకు హైదరాబాద్ తిరుగులేని చోదకశక్తిగా అవతరించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ ప్రాంగణంలో దాదాపు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘టీ-హబ్ ఫేజ్-2’ ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ వేదికగా నిలిచింది. ఒకేసారి రెండు వేలకు పైగా అంకురాలు పనిచేయగల అత్యాధునిక ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలు ఇక్కడ కొలువుదీరాయి.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్‌బీ) మెంటార్ల ద్వారా వ్యాపార మోడలింగ్, ఐఐఐటీ హైద రాబాద్ సహకారంతో సాంకేతిక మార్గదర్శకత్వం, నల్సార్ నిపుణుల ద్వారా పేటెంట్, చట్టపరమైన సలహాలు లభిస్తున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన ‘వీ-హబ్’ ఇంక్యుబేషన్‌తోపాటు బ్యాంకింగ్ క్రెడిట్ లింకేజీలను అందిస్తుండగా, సంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఏర్పాటైన ‘అబ్దుల్ కలాం ఎలీప్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’ మహిళా తయారీదారులకు పర్యావరణహిత స్థలాలు, సబ్సిడీలను కల్పిస్తోంది.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్
ప్రారంభ ఆలోచన దశ నుంచి విస్తరణ వరకు పెట్టుబడి అవసరాలు వేర్వేరు రూపాల్లో ఉంటాయి. ఉత్పత్తి నమూనాను సిద్ధం చేసుకునే దశలో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’ ( ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్) కింద ఇంక్యుబేటర్ల ద్వారా రూ. 20 లక్షల వరకు గ్రాంట్లు, మార్కెట్ పరీక్షల కోసం రూ. 50 లక్షల వరకు కన్వర్టిబుల్ డిబెంచర్లు సమకూరుతున్నాయి. తదుపరి దశలో ఉన్న సంస్థలకు ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ ( ఐఏఎన్), లీడ్ ఏంజెల్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు మూలధనాన్ని అందిస్తున్నాయి. సాంకేతిక సరిహద్దులు దాటి సామాజిక ఆవిష్కరణలు చేపట్టేవారికి క్రౌడ్ ఫండింగ్ పద్ధతులు దన్నుగా నిలుస్తున్నాయి.
ఆస్తుల తాకట్టు లేకపోతే బ్యాంకులు రుణాలు ఇవ్వవనేది ఒకప్పటి మాట. కేంద్ర ప్రభుత్వ సీజీటీఎంఎస్‌ఈ (క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్) పథకం ద్వారా ఎలాంటి మూడో వ్యక్తి పూచీకత్తు లేదా స్థిరాస్తుల తాకట్టు లేకుండానే రూ. 5 కోట్ల వరకు బ్యాంకు రుణాలను పొందే చట్టబద్ధమైన హక్కు ఏర్పాటైంది. దీనికితోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మెట్రో నగరాల్లో ప్రత్యేక ‘స్టార్టప్ బ్రాంచీ’లను ఏర్పాటు చేసి నిధుల బదిలీ, వెంచర్ డెట్ సేవలను శరవేగంగా అందిస్తున్నాయి. మరోవైపు భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్‌టీ) లాంటి స్వచ్ఛంద సంస్థలు బిజినెస్ ప్లాన్ రూపకల్పన నుంచి బ్యాంకు రుణాలు ఇప్పించేవరకు అట్టడుగు స్థాయి యువతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
కార్పొరేట్ వెంచర్ ఫండ్స్
మార్కెట్లో ఉత్పత్తికి ఆదరణ పెరిగి నిలకడైన ఆదాయం మొదలైన తర్వాత వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలైన పీక్ ఎక్స్‌వీ, యాక్సెల్, కలారీ క్యాపిటల్ వంటి ఫండ్స్ సిరీస్- A, సిరీస్-B రౌండ్ల ద్వారా కోట్ల రూపాయల విస్తరణ నిధులను సమకూరుస్తున్నాయి. బడా కార్పొరేట్ సంస్థలు సైతం తమ కార్పొరేట్ వెంచర్ ఫండ్స్ (సీవీసీ) ద్వారా వ్యూహాత్మక వాటాలను కొనుగోలు చేస్తూ మార్కెట్ విస్తరణకు బాటలు వేస్తున్నాయి. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దృక్పథం కోసం ‘స్టార్టప్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ ( ఎస్‌ఎల్‌పీ) వంటి అంతర్జాతీయ వేదికలు భారతీయ యువతను ప్రపంచస్థాయి నాయకులుగా తీర్చిదిద్దుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా వేగంగా ఎదుగుతున్న ఈ తరుణంలో, సంకల్పం ఉన్న నవతరం వ్యాపారవేత్తలకు వనరుల కొరత పెద్ద సమస్య కాదు. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ, వాస్తవిక మార్కెట్ అంచనాలు, స్పష్టమైన యూనిట్ ఎకనామిక్స్‌తో ముందుకుసాగే సంస్థలకు పెట్టుబడుల ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయి. యువత తమ మేధోశక్తికి వాణిజ్య రూపాన్నిచ్చి, మార్కెట్ అవసరాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉద్యోగార్థులుగాకాక దేశ సంపదను, ఉద్యోగాలను సృష్టించే జాతి నిర్మాతలుగా నిలబడగలుగుతారు.
– శ్రీనివాస్ గౌడ్ ముద్దం