Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ కోటిపల్లి-నర్సాపురం మధ్య నిర్మిస్తున్న రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రతాంభూలం కల్పించింది. అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కృషితో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.100 కోట్లను విడుదల చేస్తూ జీవో ఆర్జీ నంబరు 575ను విడుదల చేసింది. ఇప్పటివరకు భూసేకరణకు అవరోధం ఉన్న సమస్య తొలగిపోవడంతో ఉమ్మడి పూర్వ ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీఎంసీ బాలయోగి జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ జీవో విడుదల అంశాన్ని ఎంపీ హరీష్ మీడియాకు వివరించారు. సుమారు 25 ఏళ్ల కిందట చేపట్టిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ ప్రాజెక్టు వ్యయంలో రూ.25 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా అప్పట్లో రైల్వేశాఖతో ఒప్పందం ఏర్పడింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కూటమి ప్రభుత్వం రైల్వేశాఖతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ వ్యయంతో 25 శాతం వాటా నిధుల్లో భాగంగా రూ.100 కోట్లను విడుదల చేయడంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. బ్రా డ్గేజ్ లైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించే విధంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అవసరమైన సూచనలు జారీచేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు, రాష్ట్ర మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహా పథకం మార్గదర్శకాలను సమీక్షించిన తరువాత ప్రాజెక్టును తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఒప్పందం ప్రకారం భూసేకరణ, సివిల్ భాగాలు రెండిటినీ కలుపుకుని మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వాటాను భరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని రైల్వేశాఖకు తెలియజేశారు. భూసేకరణకు అయ్యే ఏ ఖర్చును అయినా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సర్దుబాటు చేపడుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరంలో అనుబంధ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరే వరకు కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ ప్రాజెక్టు వ్యయం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.వంద కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సహాయ కార్యదర్శి, రవాణా రోడ్లు, భవనాలశాఖ డ్రాయింగ్ డిస్పెన్స రింగ్ కోడ్ ద్వారా అమలాపురం ఆర్డీవోకు నిధులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు ఎంపీ హరీష్ బాలయోగి మీడియాకు తెలిపారు. కాగా నిధులు విడుదల చేయడంతో కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. వెంటనే భూసేకరణ పూర్తిచేసి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.