Reading Time: < 1 minute
Chandrababu To Distribute 26401 House Pattas In Vijayawada Today

CM Chandrababu: ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. విజయవాడలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని 26,401 మంది పేదల ఇళ్లకు శాశ్వత హక్కులతో పట్టాలను అందించనున్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌తో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు ఈ పట్టాలను అందుకోనున్నారు. ఈసారి పంపిణీ చేస్తున్న పట్టాలకు ప్రభుత్వ విలువ రూ.11,246 కోట్లుగా ఉండగా, మార్కెట్ విలువ రూ.28,118 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం దాదాపు 707 ఎకరాలు, 34 లక్షల చదరపు గజాల స్థలానికి సంబంధించి పేదలకు శాశ్వత హక్కులు కల్పించనున్నారు.

వేలాది కుటుంబాలకు శాశ్వత హక్కులు
పట్టాలు అందుకుంటున్న వారిలో 10 ఏళ్లు పూర్తయిన 12,710 మంది అసైన్డ్‌ లబ్ధిదారులు ఉన్నారు. గతంలో లబ్ధిదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసుకుని ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్న మరో 8,746 మందికి కూడా హక్కులు కల్పించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో అనధికారికంగా నివాసం ఉంటున్న 2,586 మందికి ఆయా స్థలాలపై శాశ్వత హక్కులు ఇవ్వనున్నారు. ఇక, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలో 28,445 మందికి రూ.8,874 కోట్ల విలువైన పట్టాలను సీఎం చంద్రబాబు అందించారు. మంగళగిరిలో మూడు విడతల్లో 5,800 మందికి రూ.727 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

విజయవాడలో తాజాగా అందిస్తున్న పట్టాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 60,646 పట్టాలను పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటి ప్రభుత్వ విలువ రూ.19,401 కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ పట్టాల మొత్తం విలువ రూ.52,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. పేద కుటుంబాలకు కేవలం నివాస హక్కు మాత్రమే కాకుండా, ఆయా ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వారికి మరింత భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది.