
ప్రస్తుత టెక్ ప్రపంచంలో గ్రాఫిక్స్ కార్డ్స్(GPUs), ఏఐ హార్డ్‌వేర్ బంగారంలా మారిపోయింది. విపరీతమైన డిమాండ్, రామ్ కొరత కారణంగా వీటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని భావించిన కొంతమంది దొంగలకు ఊహించని షాక్ తగిలింది. ఖరీదైన జీపీయూలతో నిండి ఉన్నాయనుకుని రెండు ఎన్విడియా ట్రైలర్లను ఎత్తుకెళ్లిన దొంగలకు చివరికి నిరాశే మిగిలింది. లూటీ చేసిన ఆ లారీల్లో జీపీయూలకు బదులుగా వేల టన్నుల ఇసుక మాత్రమే దొరకడంతో కంగుతిన్నారు కేటుగాళ్లు.
అసలేం జరిగింది?
కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఎన్విడియా, ప్లస్ఏఐ లోగోలతో ఉన్న 2 పెద్ద ట్రైలర్లను కొందరు దొంగలు అపహరించుకెళ్లారు. లారీ నిండా లక్షల విలువైన హై-ఎండ్ జీపీయూలు ఉంటాయని వారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. ఎన్విడియా, ప్లస్ఏఐ సంస్థలు కలిసి అటానమస్ అంటే డ్రైవర్ లెస్ ట్రక్కులను టెస్ట్ చేసే పనిలో ఉన్నాయి. ఈ ట్రక్కుల పనితీరును పరిశీలించడానికి బరువులు ఎంత వరకు మోయగలవనే సిమ్యులేషన్ కోసం ఆ ట్రైలర్లలో టన్నుల కొద్ది ఇసుకను నింపారు. దొంగలకేమో ఈ విషయం తెలియక ఏఐ చిప్స్ తస్కరించామని మురిసిపోయారు.
దొరికింది ఇసుకే.. దొంగలు పరార్
ప్లస్ఏఐ ఎగ్జిక్యూటివ్‌కు ఒక స్నేహితుడు పంపిన టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ చోరీ వ్యవహారం బయటపడింది. నెవార్క్ లోని తమ ఆఫీస్ బయట ఆ ట్రైలర్లు పార్క్ చేసి ఉండటాన్ని ఆ స్నేహితుడు గుర్తించి సమాచారం అందించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కంపెనీ ప్రతినిధులు పోలీసులు, అధికారుల సాయంతో ఆ ట్రైలర్లను.. అందులో ఉన్న ఇసుకను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. అయితే అప్పటికే నిరాశ చెందిన దొంగలు ఆ లారీలను మధ్యలోనే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అసలైన ఖరీదైన టెక్నాలజీతో కూడిన ట్రక్కులు మాత్రం సురక్షితంగా వేర్‌హౌస్ లోపలే పార్క్ చేసి ఉన్నాయట.
►ALSO READ | ఐటీ ఉద్యోగులకు విప్రో శుభవార్త: బెంచ్ టైం పెంచుతూ కొత్త రూల్స్
పెరుగుతున్న దొంగతనాలు..
డేటా సెంటర్ల విస్తరణ కోసం ఏఐ హార్డ్‌వేర్‌కు డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఇలాంటి దొంగతనాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయని వెరిస్క్ కార్గోనెట్ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ కంప్యూటర్ పరికరాలు, క్రిప్టో మైనింగ్ హార్డ్‌వేర్‌ను టార్గెట్ చేస్తూ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ సామాగ్రిని సాధారణ సరుకులా రవాణా చేస్తుండటమే ఈ దొంగతనాలకు కారణమవుతోంది.