Reading Time: 2 minutes
Hyderabad: హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త.. ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. ఒక్కసారి కొంటే..

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నగరంలోని బస్సులు, మెట్రోలో ప్రయాణం మరింత సులభతరం కానుంది. బస్సులు, మెట్రోలలో ప్రయాణించాలంటే ప్రతీసారి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే పాస్‌తో ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రోలలో కూడా ప్రయాణం చేయవచ్చు. మెట్రోలలో ఫిజికల్ టికెట్ తీసుకోవాలంటే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం వృథా అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాలన్నా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సమయం పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కామన్ పాస్‌ను తీసుకొచ్చింది. దీని వల్ల పదే పదే టికెట్ తీసుకోవాల్సిన పని లేకపోవడం వల్ల వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు.

మెట్రో, ఆర్టీసీ సేవలకు ఉమ్మడి పాస్

ఆర్టీసీ, మెట్రో సర్వీసుల కోసం కామన్ పాస్‌ను అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రజాభవన్‌లో జరగనున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిని లాంచ్ చేయనున్నారు. ఇందులో భాగంగా రోజువారీ, వారం రోజులు, నెలవారీ పాస్‌లను ప్రవేశపెడతారు. రోజువారీ పాస్ ధర రూ.400గా ఉండనుండగా.. నెలవారీ పాస్ ధర రూ.8500గా నిర్ణయించారు. పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులు రెండింటిల్లోనూ నగర పరిధిలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చన్నమాట. రోజూ ప్రతీ బస్సులో, మెట్రోలో టికెట్ తీసుకోవాల్సిన పని తప్పుతుంది. తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా ఈ కామన్ పాస్‌ను తీసుకొస్తున్నాయి. రేపటి నుంచే ఈ పాస్‌లను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ హైదరాబాద్ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ బస్సుల్లో వర్తిస్తుంది. ఇక మెట్రోలలో కూడా వర్తిస్తుంది.  ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఈ పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. దీంతో శివారు ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడనుంది.

యాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..

ఆర్టీసీ టికెట్ బుకింగ్ మరింత సులువు కానుంది. యాప్‌లో టికెట్ పొందే విధానం తీసుకొస్తుంది. రోజువారీ టికెట్‌తో పాటు డే, వీక్లీ, నెలవారీ పాస్‌లను యాప్ ద్వారానే పొందవచ్చు. దీని ఫిజికల్ టికెట్ అవసరం ఉండదు. అక్టోబర్ 2న ఈ కొత్త సిస్టమ్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. ఇప్పటివరకు పాస్ తీసుకోవాలంటే ఆర్టీసీ కౌంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ బాధ తప్పుతుంది. సులువుగా మొబైల్ యాప్ ద్వారానే ఆర్టీసీ పాస్‌లు పొందవచ్చు. ఇక ఉమ్మడి పాస్ వల్ల టికెట్ కష్టాలు తొలగిపోనున్నాయి.