Reading Time: < 1 minute
Pawan Kalyan On Rayalaseema Horticulture Hub And %e2%82%b91 Lakh Crore Project

Pawan Kalyan: రాయలసీమ ఎంతో గొప్ప నేల అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులకు ఎంతో పట్టుదల ఉందని పేర్కొన్నారు. గతంలో కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో మదనపల్లె ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవడం వల్లే ఈరోజు అభివృద్ధి, పెట్టుబడులకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు. ఏపీ ప్రజల బంగారు భవిష్యత్తుకు జనసేన పార్టీ భరోసా ఇస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రగతితో పాటు ప్రపంచ మార్కెట్లను చేరుకునే సామర్థ్యాన్ని పెంచుకుని రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. రాయలసీమను దేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రైతుల పట్టుదలను ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ అవకాశాలతో అనుసంధానించి ప్రపంచ మార్కెట్‌కు చేరువ చేయాలని అన్నారు. రాయలసీమలో పండించే ఉద్యాన పంటలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని కేవలం వ్యవసాయ కేంద్రంగా కాకుండా పెట్టుబడులు, ఉపాధి, వాణిజ్యం, ఉద్యాన రంగాలకు అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాయలసీమ రైతుల సత్తాను ప్రపంచానికి చాటేలా హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..