Reading Time: < 1 minute

నా పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించకూడదు : విజయారెడ్డి

Caption of Image.

ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్  నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై తుది నిర్ణయం వచ్చే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియను ప్రారంభించకుండా చూడాలని కోర్టులో పిటిషన్ వేశారు. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి విజయారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా.. దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్‌ విజయం సాధించారు.

అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఫారం-26లో ఇవ్వాల్సిన వివరాలను పూర్తిగా పొందుపరచలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024లో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

ఈ క్రమంలో తన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజయారెడ్డి తాజా పిటిషన్‌లో కోరారు. ముందుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై నిర్ణయం రావాలని ఆమె అభ్యర్థించారు.విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ అనంతరం తదుపరి నిర్ణయం వెలువడనుంది.

©️ VIL Media Pvt Ltd.