
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉదయం ప్రారంభమైన కాస్త సానుకూల వాతావరణం మధ్యాహ్నం నాటికి పూర్తిగా తలకిందులైంది. కొన్ని గంటల వ్యవధిలోనే మార్కెట్లు ఊహించని విధంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల(FII) నిరంతర అమ్మకాల ఒత్తిడి దలాల్ స్ట్రీట్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర నష్టాలను చవిచూడగా.. గత 25 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 8వ వారమూ నష్టాల బాటలోనే పయనించి చెత్త రికార్డును నమోదు చేశాయి.
మధ్యాహ్నం నాటికి దిగజారిన సూచీలు..
మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ సూచీ 920 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 50 సూచీ 313 పాయింట్లు కుప్పకూలింది. ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఏకంగా 3 శాతం మేర క్షీణించింది. బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు దేశీయ అమ్మకాలు మందగించడంతో తీవ్రంగా నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి కారణాలు:
1. విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు: అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో సెప్టెంబర్ 30 నాటికి FIIలు ఒక్కరోజే రూ.10వేల కోట్లకు పైగా ఈక్విటీలను విక్రయించారు. గడచిన రెండు రోజుల్లోనే సుమారు రూ.20వేల 128 కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం మార్కెట్‌ను భయపెడుతోంది.
2. పడిపోతున్న రూపాయి విలువ: డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించి 95.98 వద్ద ట్రేడవుతుండటం, డాలర్ ఇండెక్స్ మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
3. పెరిగిన ఓలటాలిటీ: మార్కెట్‌లో భయాలను సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ దాదాపు 5 శాతం పెరిగి 14.13కి చేరింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనను, అప్రమత్తతను స్పష్టంగా తెలియజేస్తోంది.
అన్ని రంగాలూ పతనమవుతున్న వేళ, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే నెమ్మదిగా పెరగడంతో వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గాయి. దీనివల్ల IT ఇండెక్స్ సుమారు 0.9 శాతం లాభపడింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త సీఈఓగా అనుప్ కుమార్ సాహా నియామకం వంటి పరిణామాలు ఆ బ్యాంకు షేర్లను 3 శాతం పైకి లాగాయి. మెుత్తానికి గ్లోబల్ పరిణామాలు భారత మార్కెట్లను వెంటాడుతూ నష్టాలను మిగులుస్తున్నాయి.