
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు.
180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ కూల్చడానికి ప్రయత్నించాడు. పైలట్ స్మిత్ పటేల్‌పై దాడి చేసి, విమానాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలని అనుకున్నాడు. కానీ స్మిత్ వెంటనే కాక్‌పిట్ డోర్లు తెరవడంతో, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి కో-పైలట్‌ను అదుపు లోకి తీసుకున్నారు. విమానం కుప్పకూలకుండా, సౌదీ అరేబియాలో ల్యాండ్ అయ్యేలా చేశారు.
దీంతో ఇప్పుడు స్మిత్ మచ్చర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇజ్రాయిల్‌లోని ప్రతీ ఇంటిలో కూడా ఇప్పుడు స్మిత్ పేరే వినిపిస్తోంది. ఇంతలా హీరోగా మారిన స్మిత్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. దీనిపై బీజేపీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ ఎందుకు ట్వీట్ చేయలేదని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర కూడా ప్రశ్నను లేవనెత్తారు. తాను ఈ అంశాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదని, అయితే రాహుల్ గాంధీ మౌనం వెనక ఒక నిర్దిష్ట కారణం ఉంటుందని, ఆయన మౌనానికి ‘‘బుజ్జగింపు రాజకీయం’’ కూడా కారణం కావచ్చని అన్నారు.