Reading Time: < 1 minute
Ap High Court Quashes 34 Bc Reservation Gos Orders Local Body Polls

BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తూ, ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)ను ఆదేశించింది.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ కొనసాగుతోందనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. సర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం డిస్పోజ్ చేసింది.

బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ దాఖలైన మరో పిల్‌ను కూడా కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలోనూ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. సెన్సెస్‌ కమిషనర్‌ జారీ చేసిన సర్క్యులర్‌ వార్డుల పునర్విభజనపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.

ఇక, రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ 2021 జూన్‌ 9న తీసుకొచ్చిన ఏపీ మున్సిపాలిటీ సవరణ చట్టం (యాక్ట్‌ 5/2021)ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, సర్‌ ప్రక్రియ, వార్డుల పునర్విభజన, గ్రామాల విలీనం వంటి అంశాలపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.