Reading Time: < 1 minute

సీఈసీ రాజీనామా చేయాలి : సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే

Caption of Image.

ముంబై: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని   సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని, అక్టోబర్ చివరి నుంచి ఢిల్లీలోని జంతర్‌‌మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. అక్టోబర్ 2న ముంబైలోని దాదర్‌‌లో శివాజీ పార్క్ వద్ద సీఈసీ రాజీనామా కోరుతూ నిరసన చేపడతామని దీప్కే తెలిపారు.

పోలీసుల నుంచి అనుమతి నిరాకరించిన విషయంపై స్పందిస్తూ… ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శివాజీ పార్క్‌‌లో రాజకీయ సభ నిర్వహించగలిగితే, తమకు నిరసన తెలిపే అవకాశం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ‘‘అసమ్మతి ప్రజాస్వామ్యంలో భాగం. జైలుకు వెళ్లేందుకు నేను భయపడను. మళ్లీ మళ్లీ నిరసన చేస్తాను’’ అని దీప్కే అన్నారు. గోవా, బెంగళూరు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పాట్నా, రాంచీల్లోనూ నిరసనలు చేపడతామని సీజేపీ నేత అజింక్య షిండే తెలిపారు.

అక్టోబర్ 6న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు చేపట్టనున్న నిరసనలో తమ పార్టీ పాల్గొనదని దీప్కే స్పష్టం చేశారు. తాము స్వతంత్ర ఉద్యమంగా కొనసాగుతామని చెప్పారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, పౌర సమాజానికి కూడా భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.