
Royal Enfield Himalayan 440 Bookings Suspended: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన సరికొత్త ‘హిమాలయన్ 440’ బైక్‌కు మార్కెట్‌లో మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల లద్దాఖ్‌లో జరిగిన తొలి హిమాలయన్ బేస్ క్యాంప్‌లో లాంచ్ చేసిన ఈ బైక్‌ను దక్కించుకోవడానికి బైక్ లవర్స్ తెగ పోటీ పడుతున్నారు. కంపెనీ ఊహించిన దానికంటే దారుణంగా ఆర్డర్లు వచ్చి పడటంతో ఏకంగా 6 నెలలకు సరిపడా స్టాక్ అప్పుడే బుక్ అయిపోయింది. దీంతో కంగారు పడిన రాయల్ ఎన్‌ఫీల్డ్, తాత్కాలికంగా ఈ బైక్ బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి బైక్‌లు డెలివరీ చేయడంపైనే కంపెనీ ప్రస్తుతం దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ కెపాసిటీని మరింత పెంచి, కొత్త ఆర్డర్లను పూర్తి చేయగలమని నమ్మకం వచ్చాకే మళ్లీ బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. కాబట్టి కొత్తగా ఈ బైక్ కొనాలనుకునే వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చే తదుపరి ప్రకటన వరకు ఆగాల్సిందే.
రైడర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను మైండ్‌లో పెట్టుకుని, పాత ‘హిమాలయన్ 411’లోని బెస్ట్ ఫీచర్లను అలానే ఉంచుతూ ఈ కొత్త హిమాలయన్ 440ని రీ-లాంచ్ చేశారు. ఇంజిన్ సైజ్, లేటెస్ట్ హార్డ్‌వేర్, మోడ్రన్ ఫీచర్లను పెంచినప్పటికీ.. బైక్ సైజ్, సీటింగ్ పొజిషన్‌ను మాత్రం చాలా కంఫర్ట్‌గా డిజైన్ చేశారు. దీనివల్ల బైక్‌ను నడపడం, ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో 443 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 6,250 ఆర్‌పీఎమ్ వద్ద 25.4 బీహెచ్‌పీ పవర్, 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 81 ఎమ్ఎమ్ బోర్, 86 ఎమ్ఎమ్ స్ట్రోక్ ఉన్న ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌ను జత చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో ఒక గేర్ అదనంగా రావడం వల్ల లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ప్రయాణం చాలా స్మూత్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.
లాంగ్ టూర్స్ చేసే వారి కోసం ఇందులో 15 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించారు. ఆఫ్ రోడింగ్, రఫ్ రోడ్లను తట్టుకోవడానికి వీలుగా ముందు భాగంలో 21 అంగుళాల స్పోక్ వీల్, వెనుక 17 అంగుళాల వీల్‌ను అమర్చారు. సస్పెన్షన్ విషయానికొస్తే.. ఫ్రంట్‌లో 200 ఎమ్ఎమ్ ట్రావెల్‌తో కూడిన 41 ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్‌లో 180 ఎమ్ఎమ్ ట్రావెల్ ఇచ్చే లింకేజ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇక రోడ్డుపై ఎంతటి గుంతలున్నా ఇబ్బంది లేకుండా 220 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా 800 ఎమ్ఎమ్ సీట్ హైట్ ఇచ్చారు. సేఫ్టీ కోసం ఫ్రంట్‌లో 300 ఎమ్ఎమ్ డిస్క్, రియర్‌లో 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్స్‌తో పాటు స్టాండర్డ్‌గా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. మట్టి లేదా ఇసుక రోడ్లపై రైడింగ్ కోసం వెనుక ABSను స్విచ్ ఆఫ్ (స్విచబుల్) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రూట్ తెలుసుకోవడానికి ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్‌లైట్, ఫోన్ ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ను అందించారు. సామాన్లు పెట్టుకోవడానికి 10 కేజీల బరువును మోయగల రియర్ లగేజ్ ర్యాక్‌ను కూడా కంపెనీ ఇన్-బిల్ట్‌గా ఇచ్చింది. బైక్ మొత్తం బరువు (కర్బ్ వెయిట్) 199 కేజీలు ఉండగా, ఇది ఏకంగా 176 కేజీల బరువును మోయగలదు (పెలోడ్ కెపాసిటీ). ఇన్ని సూపర్ ఫీచర్లు ఉన్న ఈ డ్రీమ్ బైక్ ధరను చెన్నై ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 2.29 లక్షలుగా నిర్ణయించారు.