Reading Time: 2 minutes
John Campbell: బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదని 22 నెలల బాన్.. ఇప్పుడు భారత్‌పై 65 బంతుల్లోనే విధ్వంసక సెంచరీ

John Campbell: భారత్‌తో గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో వెస్ట్ ఇండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగారు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న ఆయన మొత్తంగా 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించారు. వెస్టిండీస్ వన్డే చరిత్రలోనే ఐదో ఫాస్టెస్ట్ సెంచరీగా ఇది నిలిచింది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో కూడా కాంప్‌బెల్ 62 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. చివరికి గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించారు.

భారత బౌలర్లకు చుక్కలు

టెక్నిక్, పవర్ కలగలిపి షాట్లు ఆడుతూ భారత పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అరంగేట్రం చేసిన ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్‌లకు కాంప్‌బెల్ చుక్కలు చూపించారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టి భారత్‌పై తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు కూడా ఆయన ధాటిని అడ్డుకోలేకపోయారు. అంతర్జాతీయ వన్డేల్లో కాంప్‌బెల్ సెంచరీ చేయడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2019లో ఐర్లాండ్‌పై ఆయన వన్డే సెంచరీ చేశారు. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఈ కరేబియన్ ప్లేయర్ సెంచరీ బాదడం విశేషం.

22 నెలల నిషేధం

జాన్ కాంప్‌బెల్ కెరీర్‌లో 2022 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించారు. డోపింగ్ నిబంధనల ప్రకారం శాంపిల్ ఇవ్వకపోవడం తీవ్రమైన నేరం కావడంతో JADCO ప్యానెల్ ఆయనపై నాలుగేళ్ల సుదీర్ఘ నిషేధం విధించింది. అధికారులు తమకు సరిగ్గా సమాచారం ఇవ్వలేదని, తను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడలేదని కాంప్‌బెల్ లీగల్ టీమ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‎లో అప్పీల్ చేసింది. విచారణ అనంతరం కాంప్‌బెల్ ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని భావించిన కోర్టు, శిక్షను 22 నెలలకు తగ్గించడంతో 2024 ఆగస్టులో ఈ నిషేధం ముగిసింది.

దేశవాళీల్లో సత్తా చాటి రీఎంట్రీ

నిషేధం ముగిసిన తర్వాత వెస్ట్ ఇండీస్ దేశవాళీ క్రికెట్‌లో కాంప్‌బెల్ పరుగుల వరద పారించారు. నిలకడైన ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుత భారత పర్యటనలో నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, కాంప్‌బెల్ తన దూకుడుతో భారత బౌలర్ల వ్యూహాలను తిప్పికొట్టి వెస్ట్ ఇండీస్‌కు భారీ స్కోరు సాధించే దిశగా బలమైన పునాది వేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..