
అసలే రావణకాష్ఠంలా రగులుతున్న పశ్చిమాసియాలో జరిగిన అనూహ్య ఘటన.. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరో 9/11 ఘటన తరహాలో ఏదో జరగబోతోందని అందరూ వణికిపోయారు. చివరకు పైలట్ సాహసం, కొందరు ప్రయాణికుల ధైర్యం.. వెరసి.. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే నిమిషాల వ్యవధిలో ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన పరిణామాలు.. ప్రపంచానికి గత కాలపు చేదు అనుభవాల్ని గుర్తుచేశాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఉన్నట్టుండి కుదుపులు వచ్చాయి. కాక్‌పిట్ లో ఏదో జరుగుతోందని అనుమానించిన కొందరు ప్రయాణికులు వెళ్లేసరికి.. పైలట్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే టెన్షన్ వాతావరణం నుంచి రిలీఫ్ రావడంతో.. మొత్తం 174 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
సాఫీగా సాగిపోతున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణం.. ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. కాసేపు ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ తర్వాత కాక్ పిట్ నుంచి కేకలు, అరుపులు వినిపించడంతో.. కొందరు ప్రయాణికులు అక్కడకు పరుగెత్తారు. అప్పటికే తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్తున్న పైలట్.. అతి కష్టం మీద కాక్ పిట్ తలుపు తెరిచి పడిపోయారు. అప్పుడు కో పైలట్ విమానం కంట్రోల్ చేస్తున్నరు. దీంతో అతడే పైలట్‌ను గాయపరిచాడని అర్థం చేసుకున్న ప్రయాణికులు.. కోపైలట్‌ను కదలకుండా పట్టుకున్నారు. ఈలోగా ఆఫ్ డ్యూటీ పైలట్ వచ్చి విమానాన్ని అదుపులోకి తెచ్చి.. సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోనూ మెజార్టీ ఇజ్రాయెలీలే. దీనికి తోడు కోపైలట్ ఒమన్ జాతీయుడనే ప్రచారం జరిగింది. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్ ప్రయాణికుల్ని టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు వచ్చాయి. విమానం ల్యాండయ్యేదాకా.. అటు ఇజ్రాయెల్‌లో, ఇటు సౌదీ అరేబియాలో హై అలర్ట్ నెలకొంది. ల్యాండింగ్ తర్వాత అందరూ పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల అనుభవాలు తెలుసుకున్నాకే.. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో దేశాధినేతలకు తెలిసొచ్చింది. పైలట్ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఉండకపోతే.. కచ్చితంగా మరో 9/11 దాడి జరిగి ఉండేదేమోననే చర్చ జరుగుతోంది. లేకపోతే కాందహార్ హైజాక్ తరహాలో కోపైలట్ కొన్ని గంటల పాటు విమానంలో హైడ్రామా సృష్టించి.. కొందరు ప్రయాణికుల ప్రాణాలు బలితీసుకుని ఉండేవాడనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఏతావాతా ఎలాంటి నష్టం జరగకపోయినా.. ఫ్లైదుబాయ్ విమాన ఘటనను తేలికగా తీసుకోకూడదని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఇటు ఇజ్రాయెల్, అటు సౌదీ.. మరోవైపు విమాన సంస్థ కూడా దర్యాప్తు జరుపుతున్నాయి. దర్యాప్తు పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. అయితే దర్యాప్తులో మాత్రం ఏ కోణాన్నీ వదిలిపెట్టకూడదనే సూచనలు వస్తున్నాయి.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లై దుబాయ్ విమానం ఆకాశంలో ఉండగా కెప్టెన్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేశాడు. దీంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డాడు. కో-పైలట్‌తో పోరాడి ప్రయాణికుల ప్రాణాలను కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాపాడారు. అంతకు ముందు కో పైలట్ ఫ్లై దుబాయ్ విమానాన్ని కంట్రోల్‌లోకి తీసుకుని దానిని బలవంతంగా కిందికి దించడానికి ప్రయత్నించాడు, ఈ విషయాన్ని గమనించిన పైలట్ మచ్చర్, కో పైలట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కో పైలట్, పైలట్ స్మిత్ మచ్చర్‌ను కత్తితో పొడిచాడు. ఈ దాడిని ప్రతిఘటించి కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను అలర్ట్ చేసాడు. దీంతో కో పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భారత పైలట్ కెప్టెన్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనలో మరో కీలక పాత్ర పోషించిన వ్యక్తి షోటా ముసావ్. వృత్తిరీత్యా దంత వైద్యుడైన ఆయన విమానంలో ఉన్న ఏకైక వైద్య నిపుణుడిగా గాయపడిన పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న మచ్చార్‌కు చికిత్స చేసినట్లు ముసావ్ తెలిపారు. ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన నేపథ్యంలో సదరు విమాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను ఫ్లై దుబాయ్ తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది, విమాన కార్యకలాపాల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ఈ తాత్కాలిక సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్‌అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం విమానం ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది. దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాక్‌పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
దాడికి గల కారణం వెంటనే తెలియరాలేదు. విమానం హైజాక్ అయి ఉండొచ్చన్న అనుమానంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను గాల్లోకి పంపింది. విమానం అంత తీవ్రంగా కిందకు దిగడంతో తోక భాగంలోని రడ్డర్‌లో ఎక్కువ భాగం ఊడిపోయింది. అయినా అది కూలిపోకుండా సురక్షితంగా ల్యాండ్ కావడంపై విమానయాన నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూదుల పవిత్ర దినాల సందర్భంగా పాఠశాలలు, కార్యాలయాలకు ఇచ్చిన సెలవులు ముగుస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 27న ఇజ్రాయెల్‌లో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. విదేశాల్లో ఉంటూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇజ్రాయెల్‌లో లేకపోవడంతో పలువురు ఇజ్రాయెలీలు ఓటు వేసేందుకు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు.ఇటీవలి రోజుల్లో భద్రతా ముప్పు పెరిగిందని నెతన్యాహు హెచ్చరించారు. దీనికి తోడు హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌పై దాడి జరిగిన 2023 అక్టోబర్ 7 ఘటనకు వారం రోజుల్లో వార్షికోత్సవం జరగనుంది. ఆ దాడి తర్వాత పలు యుద్ధాలు చోటుచేసుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.
దుబాయ్ నుంచి బయలుదేరిన సుమారు రెండున్నర గంటల తర్వాత విమానంలో గందరగోళం నెలకొంది. ఫ్లైట్‌రాడార్24 సమాచారం ప్రకారం.. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం 33 వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం నిమిషంలోనే 17 వేల అడుగులకు దిగింది. ఆ తర్వాత జోర్డాన్ సరిహద్దుకు సమీపంలో అస్థిరంగా చక్కర్లు కొట్టి, మరో గంటకు టబుక్‌లో ల్యాండ్ అయింది.టబుక్‌లోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకారం.. విమానం ఉదయం 9.45 గంటలకు అక్కడ దిగింది. అంతకుముందు గంటకు అది అత్యవసర సందేశం పంపింది.
విమాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య జరిగిన సంభాషణ ప్రకారం.. సౌదీ అరేబియా, జోర్డాన్ నుంచి విమానాన్ని తొలుత వెనక్కి పంపించారు. చివరకు అది టబుక్‌లో దిగింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారు.పైలట్ గొంతు వణుకుతూ మేడే అని అత్యవసర సందేశం పంపింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నారని, అంబులెన్స్‌లు అవసరమని పైలట్ చెప్పినట్లు వివరించారు.అయితే సౌదీ అరేబియా తొలుత ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. జోర్డాన్‌కు వెళ్లాలని సూచించింది. జోర్డాన్ సైన్యం నుంచి అనుమతి వచ్చే వరకు వేచి ఉండాలని విమానానికి చెప్పారు. అనంతరం విమానం దిశ మార్చుకుంది.ఆ తర్వాత పైలట్ మళ్లీ సౌదీ అరేబియా వైపు తిరిగి.. టబుక్‌లో తప్పనిసరిగా దిగాల్సి ఉంటుందని చెప్పాడు. ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారన్న దానిపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎలాంటి కారణం చెప్పలేదు. భద్రతకు సంబంధించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు యూఏఈ పౌర విమానయాన సంస్థ తెలిపింది.
అయితే ఇజ్రాయెలీ ప్రయాణికులు ఉన్న విమానాలు ఇలాంటి దుర్ఘటనల్లో ఇరుక్కోవడం, అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి కాదు. 1960, 1970 దశకాల్లో పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకుని వరుస విమాన హైజాకింగ్‌లు, దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఇజ్రాయెల్‌లో దశాబ్దాలుగా విమాన హైజాకింగ్ ఘటన చోటుచేసుకోలేదు. ఇప్పిటకే ఇజ్రాయెల్ విమానాశ్రయాల్లో ప్రపంచంలోనే కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాల్లోనూ ఇవి కొనసాగుతున్నాయి.సౌదీకి ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినా 2022లో ఇజ్రాయెల్ విమానాలు తమ గగనతలం మీదుగా ప్రయాణించడంపై ఉన్న దీర్ఘకాల నిషేధాన్ని సౌదీ ఎత్తివేసింది.అప్పటి నుంచి ఇజ్రాయెలీ ప్రయాణికులతో ఉన్న విమానాలు అత్యవసరంగా దిగేందుకు సౌదీ సహకరిస్తోంది. 2023లో ఓ విమానంలో విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తడంతో అది సౌదీలో అత్యవసరంగా దిగింది. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతల తరుణంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన.. కొత్త భద్రతా సవాళ్లను తెరపైకి తెచ్చింది.