Reading Time: 2 minutes

50 ఏళ్లు దాటాక సగం మందికి మగవారికి బట్టతలే… అసలు తలమీద ఏం జరుగుతోంది?

Caption of Image.

మనుషులకు ఉండే ముఖ్యమైన లక్షణాల్లో జుట్టు ఒకటి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా మనిషి తలపై జుట్టు శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.

అయితే, ఇంత ముఖ్యమైన జుట్టును అంత ఎక్కువ సంఖ్యలో పురుషులు కోల్పోవడం ఒక వింతైన విషయం. ఎండోటెక్స్ట్ (Endotext) రివ్యూ ప్రకారం, 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు సగం మంది పురుషుల్లో బట్టతల కనిపిస్తుంది, వయసు పెరిగే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. పరిణామ జీవశాస్త్రవేత్తలకు (Evolutionary Biologists) ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే 

జుట్టు ఉడిపోవడం వల్ల మనుషులకు నష్టం జరుగుతుంటే, ప్రకృతి నియమాల ప్రకారం కాలక్రమేణా ఈ లక్షణం అంతరించిపోయి ఉండాలి. కానీ తరతరాలుగా, వివిధ ప్రాంతాల ప్రజల్లో పురుషుల బట్టతల ఇలాగే కొనసాగుతోంది.

  తలపై అసలు ఏం జరుగుతోంది?  
పురుషుల్లో వచ్చే బట్టతలను వైద్య భాషలో ఆండ్రోజెనెటిక్ అలోపేసియా (Androgenetic Alopecia) అంటారు. ఈ పేరులోనే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

*ఆండ్రోజెన్లు (హార్మోన్లు): టెస్టోస్టెరాన్ వంటి పురుష హార్మోన్లు.
*జన్యువులు (జీన్స్): వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు.

కీలక పాత్ర పోషించే హార్మోన్ – DHT
శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ నుండి డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అనే మరో శక్తివంతమైన హార్మోన్ తయారవుతుంది. జన్యుపరంగా ఈ హార్మోన్ పట్ల సున్నితత్వం ఉన్న పురుషులలో, తలపై ఉన్న వెంట్రుకల కుదుళ్లు (Hair Follicles) DHT ప్రభావం వల్ల క్రమంగా కుంగిపోతాయి.

దీనివల్ల ప్రతి పెరుగుదల చక్రంలో జుట్టు ఇంతకుముందు కంటే సన్నగా, పొట్టిగా మారుతుంది. చివరికి సన్నటి దారం పొగులా మిగిలిపోతుంది. తలపై ఉన్న జుట్టు కుదుళ్లు పూర్తిగా చనిపోవు, కానీ ఇంతకుముందులా ఒత్తైన జుట్టును ఉత్పత్తి చేయడం ఆపేస్తాయి.

ఒక ఆసక్తికరమైన నిజం ఏంటంటే  బట్టతల అనేది కేవలం “తండ్రి వైపు” నుంచే వస్తుందనేది ఒక పాత నమ్మకం మాత్రమే. శరీరంలోని అనేక రకాల జన్యువుల కలయిక వల్ల ఇది వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

 శరీరానికి ఒకలా… తలకు మరోలా?  
జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్లు (ఆండ్రోజెన్లు) గడ్డం, మీసాలు, ఒంటిపై జుట్టును ఒత్తుగా పెంచుతాయి.  ఈ విచిత్రాన్నే డాక్టర్లు ఆండ్రోజెన్ పారడాక్స్ (Androgen Paradox) అంటారు. అంటే, శరీరంలోని వేర్వేరు భాగాల్లో ఉన్న వెంట్రుకల కుదుళ్లు ఒకే హార్మోన్‌కు భిన్నంగా స్పందిస్తాయి.

 చిన్న వయసులో ఉన్నప్పుడు ఆండ్రోజెన్ హార్మోన్లు కండరాల బలానికి, గొంతు బొంగురుగా మారడానికి, ప్రత్యుత్పత్తికి బాగా సహాయపడతాయి. ఇవే హార్మోన్లు వయసు పెరిగిన తర్వాత (40–50 ఏళ్లకి) బట్టతలకు కారణమవుతాయి. ప్రకృతి ఎప్పుడూ యవ్వనంలో జీవి మనుగడకు, సంతానోత్పత్తికి ఉపయోగపడే లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వయసు పెరిగిన తర్వాత వచ్చే బట్టతల వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి,  ఇది తొలగిపోలేదు.

బట్టతల వెనుక మరో కోణం
1996లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బట్టతల అనేది ఒక వ్యక్తి అనుభవాన్ని, పరిపక్వతను సూచించే సామాజిక సంకేతం (Social Signal) కావచ్చు. తలపైన జుట్టు తగ్గడం వల్ల ఆ వ్యక్తి యవ్వనంలో ఉండే ఆవేశకరమైన పోటీని దాటి, మరింత తెలివైనవాడిగా, సమాజంలో స్థిరపడిన పెద్ద దిక్కుగా కనిపించే అవకాశం ఉందని ఈ పరికల్పన చెబుతోంది. అయితే ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే, పూర్తి ఆధారాలు లేవు.

మనుషుల్లోనే కాదు… జంతువుల్లో కూడా!
బట్టతల అనేది కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు. చింపాంజీలు, ఒరాంగుటాన్లు, ఒక రకమైన కోతులకు (స్టంప్-టెయిల్డ్ మకాక్స్) కూడా వయసు పెరిగే కొద్దీ తల మీద జుట్టు పలుచబడుతుంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారిలో ఇది వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, యూరోపియన్ పురుషులలో బట్టతల ఎక్కువగా, తూర్పు ఆసియా (ఈస్ట్ ఏషియా) పురుషులలో కాస్త తక్కువగా కనిపిస్తుంది.

 బట్టతల అనేది శరీరంలో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు కాదు. యవ్వనంలో మన శరీరానికి బలాన్ని ఇచ్చే హార్మోన్ల వల్ల, వయసు పెరిగిన తర్వాత వచ్చే ఒక మామూలు దుష్ప్రభావం (Side-effect) మాత్రమే. ప్రకృతి శరీరాన్ని యవ్వనంలో బాగా పనిచేసేలా డిజైన్ చేస్తుంది, ఆ తర్వాత వచ్చే ఇలాంటి చిన్నచిన్న మార్పులతో మనం జీవించాల్సిందే!

©️ VIL Media Pvt Ltd.