Reading Time: < 1 minute
Nepal Himlung Himal Avalanche 15 Nepali Workers Killed

నేపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశీ పర్వతారోహకుల కోసం హిమాలయాల్లో బేస్ క్యాంప్‌ను సిద్ధం చేస్తున్న నేపాలీ కార్మికులపై భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ నెలతో ముగియనున్న శరదృతువు పర్వతారోహణ సీజన్‌లో చోటుచేసుకున్న అత్యంత ప్రాణాంతక ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

ఉత్తర నేపాల్‌లోని మానాంగ్ జిల్లాలో 7,126 మీటర్ల (23,379 అడుగుల) ఎత్తైన హిమ్‌లుంగ్ హిమాల్ పర్వతం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. విదేశీ పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు అవసరమైన బేస్ క్యాంప్‌ను సిద్ధం చేసేందుకు నేపాలీ కార్మికులు అక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తుండగా… తాళ్లు బిగిస్తుండగా వారిపై హిమపాతం విరుచుకుపడింది. 15 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు.

గురువారం మంచు కింద నుంచి మరో 8 మృతదేహాలను బయటకు తీశారు. అంతకుముందే మరో 7 మృతదేహాలను వెలికితీశారు. గురువారం వెలికితీసిన మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఖాట్మండు తరలించనున్నట్లు గురుంగ్ తెలిపారు. మరో కార్మికుడు గల్లంతయ్యాడని.. సజీవంగా గుర్తించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కూడా త్వరలోనే ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే సహాయక బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.

అదృష్టవశాత్తూ హిమపాతం సంభవించే సమయానికి విదేశీ పర్వతారోహకులు బేస్ క్యాంప్‌కు చేరుకోలేదు. దీంతో భారీ ప్రాణనష్టం నుంచి వారు తప్పించుకున్నారు. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు నేపాల్‌లోని పర్వత ప్రాంతాలను సందర్శించడంతో పాటు పర్వతారోహణకు వస్తుంటారు. వీరి కోసం గైడ్లు, పోర్టర్లు, ఇతర సహాయక సిబ్బందిగా వేలాది మంది నేపాలీయులకు ఉపాధి లభిస్తోంది.