
- తాళం వేసి పరార్
జూబ్లీహిల్స్, వెలుగు: అమీర్‌పేట్‌లోని గోకుల్ ప్రైడ్ హోటల్ గదిలో బి.శిరీష(34) అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన శిరీష ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తోంది. భర్తతో విడాకుల అనంతరం ఆమెకు వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం ఓగలపూర్‌కు చెందిన ఎ.శ్రీనివాస్ (38)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. కుటుంబసభ్యులు నిరాకరించినా శ్రీనివాస్ ఆమెను గుడికి తీసుకెళ్లి, మంగళసూత్రం కట్టాడు. వీరిద్దరూ తరచూ హైదరాబాద్‌లోని హోటళ్లు, లాడ్జీల్లో కలుసుకునేవారు. సోమవారం ఇద్దరూ గోకుల్ ఫ్రైడ్ హోటల్‌కు వెళ్లారు.
అక్కడ గదిలో శ్రీనివాస్ కర్టెన్ రాడ్‌తో శిరీషపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం శ్రీనివాస్బయట నుంచి గదికి తాళం వేసి పరారయ్యాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. హోటల్లో శిరీష, శ్రీనివాస్ఏదైనా విషయంలో గొడవ పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, సీసీ ఫుటేజీ, హోటల్రికార్డుల ఆధారంగా నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.