
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్రీడా వర్గా్ల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్నకాక మొన్న జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ ఇవ్వడంతో తీవ్రంగా అసంతృప్తికి లోనైన అభిషేక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వీడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీలతో చర్చలు కూడా జరుగుతున్నాయని.. ఈ రేసులో పంజాబ్, ఢిల్లీ కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్‌లో కీ ప్లేయర్ అభిషేక్ శర్మ జట్టును వీడితే ఫ్రాంచైజీకి భారీ ఎదురు దెబ్బే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
అన్నీ తప్పుడు వార్తలే: ఎస్ఆర్హెచ్ సీఈవో
అభిషేక్ శర్మ హైదరాబాద్‌ను వీడుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంపై ఎస్ఆర్హెచ్ సీఈవో షణ్ముగం స్పందించారు. ఈ వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభిషేక్ హైదరాబాద్ ను వీడతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. అభిని వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు. అనవసరంగా పుకార్లు పుట్టించొద్దని, ఇది ఎంతమాత్రం నిజం కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో అభిషేక్ ఫ్రాంచైజీ మార్పు వార్తలకు తెరపడింది.
ఎస్ఆర్ హెచ్లో కెప్టెన్సీ చిచ్చు..?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్సీ చిచ్చు రాజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2026 ఐపీఎల్ సీజన్ మొదట్లో వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచులకు అందుబాటులో లేడు. దీంతో టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. అయితే, జట్టులో ఎప్పుటినుంచో ఉంటున్న తనను కాదని ఇషాన్‌కు కెప్టెన్సీ ఇవ్వడం అభిషేక్‌కు ఏ మాత్రం నచ్చలేదట. అభిషేక్ 2019 నుంచి ఎస్ఆర్హెచ్ తరుఫున ఆడుతుండగా.. ఇషాన్ 2025లో జట్టులోకి వచ్చాడు.
టీమ్‌లో కీలక ఆటగాడినైనా తనను పట్టించుకోకుండా నిన్నమొన్న వచ్చిన వ్యక్తికి జట్టు పగ్గాలు అప్పగించడంతో హైదరాబాద్ యాజమాన్యంపై అభిషేక్ గుర్రుగా ఉన్నాడటా. తనను పట్టించుకోని ఫ్రాంచైజీ గురించి తనకు కూడా అవసరం లేదని హైదరాబాద్‌ను వీడాలని భావిస్తున్నాడంటా. ఇందులో భాగంగానే ముంబై, గుజరాత్ జట్లతో అభిషేక్ సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పోర్ట్స్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అభిషేక్ హైదరాబాద్‌ను వీడితే దక్కించుకునేందుకు ఢిల్లీ, పంజాబ్ కూడా రేసులో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
అభిషేక్ శర్మ ఐపీఎల్ కెరీర్:
విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ 2018లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అభిషేక్ 2019లో ట్రేడింగ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ తరుఫునే ఆడుతున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 92 మ్యాచులు ఆడిన అభి 2,379 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 వికెట్లు కూడా తీశాడు.