
ఐటీ హబ్ బెంగళూరులో ఇళ్ల యజమానుల పోకడలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. అద్దెకు వచ్చేవారు ఎంత కష్టపడుతున్నారో పట్టించుకోకుండా.. ఇష్టానుసారంగా డిపాజిట్లు, అద్దె డిమాండ్ చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఫీసుకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు వెతుక్కున్న ఓ ఉద్యోగికి.. అక్కడి ఓనర్లు చెప్పిన షరతులు విని దిమ్మతిరిగిపోయింది.
ఒక 2బీహెచ్‌కే ఫ్లాట్ కోసం ఓనర్ అడిగిన అద్దె, డిపాజిట్ చూస్తే ఎవరికైనా గుండె గుబేలుమనాల్సిందే. నెలవారీ అద్దె అటూఇటూగా రూ.70వేలు చెప్పగా, అడ్వాన్స్ డిపాజిట్ రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తం ఇస్తున్నామంటే కనీసం ఆ ఫ్లాట్ అయినా ప్యాలెస్‌లా ఉండాలి కదా? కానీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఫుల్లీ ఫర్నిషిడ్ అని చెప్పిన ఆ ఇంట్లో కనీసం ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, డైనింగ్ టేబుల్, రెండో గదిలో బెడ్ కూడా లేవట. కనీసం పీజీలలో ఉండే సౌకర్యాలు కూడా ఆ ఫ్లాట్‌లో లేవని బాధితుడు వాపోయాడు.
అంతేకాకుండా ప్రతి ఏటా అద్దెను 7 నుంచి 8 శాతం పెంచుతామని ఓనర్ షరతు పెడుతున్నారట. మిగతా వాళ్లైతే 10 శాతం పెంచుతారు, నేను నీకు తక్కువే చేస్తున్నా అంటూ ఓనర్లు ఇస్తున్న బిల్డబ్ అద్దెదారులు కళ్లు తేలేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల జీతాలు అంతులేకుండా పెరిగిపోతున్నాయని ఓనర్లు భావిస్తున్నారా? లేక అద్దెదారులు డబ్బును చెట్ల నుంచి ఏరుకొస్తున్నారనుకుంటున్నారా? అంటూ ఆ టెనెంట్ తన ఆవేదన వెళ్లగక్కారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరులోని ఓనర్ల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు సిస్టమ్ మనల్ని మానసికంగా వేధించేలా తయారైంది. ఆఫీసుకు దూరం ఉంటే ట్రాఫిక్‌లో నరకం చూడాల్సి వస్తుంది, దగ్గరలో ఉంటే ఓనర్ల దోపిడీ భరించాలని కొందరు వాపోతున్నారు. ఆ రూ.70 వేల ఫ్లాట్‌ను తాము తీసుకోకుండా ధైర్యంగా వెనక్కి వచ్చేశామని.. ఎవరైనా సరే ఓనర్ల అన్యాయపు డిమాండ్లకు తలగ్గకుండా ప్రశ్నించాలని సదరు ఉద్యోగి కోరారు.
మొత్తానికి బెంగళూరులో ఇళ్ల ఓనర్ల కక్కుర్తి, నోటికొచ్చినంత అడ్వాన్స్ డిపాజిట్ల కోరికలతో సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారామని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఇలాంటి విషయాలపై కర్ణాటక ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అస్సలు పట్టించుకోకపోవటంతో సిలికాన్ వ్యాలీ పరువు రోజురోజుకూ పోతూనే ఉంది. నగరంలో ఏం జరుగుతోందనేది కూడా ప్రభుత్వం పట్టించుకునేంత సమయం లేకుండా బిజీగా ఉండటంతో అద్దెకు ఉంటున్న ప్రజల కష్టాలు రొటీన్ సీరియల్ స్టోరీలుగా సోషల్ మీడియాలో మిగిలిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇతర నగరాల్లో జాబ్స్ వెతుక్కుని లేదా బదిలీలు చేయించుకుని వెళ్లిపోవటం ఇటీవలి కాలంలో పెరిగింది.