
ప్రస్తుతం ఏపీలో స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే అమలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ బస్సులు, తిరుమల-తిరుపతి మధ్య నడిచే సప్తగిరి బస్సులు, నాన్ స్టాప్, అంతరాష్ట్ర బస్సుల్లో స్త్రీశక్తి పథకం వర్తించపచేయడం లేదు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. మహిళల కోసం భవిష్యత్తులో ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
ఏపీ బస్సులు కొంటాం..
విజయవాడలో బుధవారం జరిగిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26,400 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీశక్తి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, భవిష్యత్తులో ఏసీ బస్సులు కూడా కొంటామని స్పష్టం చేశారు. మొన్న విశాఖలో, ఆ తర్వాత మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించామని, ఇవాళ విజయవాడలో పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఇప్పటివరకు 60 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఆస్తులను పేదలు అమ్ముకోవద్దని సూచించిన చంద్రబాబు,, భవిష్యత్ కోసం ఉంచుకోవాలని తెలిపారు.
ఏసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఎప్పటినుంచంటే..?
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని చంద్రబాబు అన్నారు. గత పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిశాయని, ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల భవిష్యత్తులో ఆటలాడుకుందని, భూసర్వే పేరుతో ప్రతీ గ్రామంలో వివాదాలు సృష్టించిందన్నారు. ప్రజల ఆస్తులు, పాస్‌బుక్‌లపై వారి ఫొటోలు వేసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్‌బుక్‌లు అందిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఏసీ బస్సుల్లో కూడా త్వరలో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కొత్త ఏసీ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటిని కొనుగోలు చేసిన తర్వాత ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.