Reading Time: 2 minutes

గిగ్ వర్కర్ల అధిక జీతాల్లో.. తెలంగాణ మొదటి స్థానం: మంత్రి వివేక్

Caption of Image.

హైదరాబాద్: గిగ్ వర్కర్లు అధిక జీతాలు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, వారి పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని చెప్పారు. కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన UPZY House ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

UPZY House ఫౌండర్లకు మంత్రి వివేక్ అభినందనలు తెలిపారు. గిగ్ వర్కర్లు ఒకరినొకరు కలుసుకునేందుకు, పని మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు UPZY House మంచి ప్రదేశంగా ఉంటుందని అన్నారు. తాను మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు UPZY Houseను సందర్శిస్తానని చెప్పారు.గిగ్ వర్కర్లు మల్టీ లెవెల్ నేషనల్ కంపెనీలలో పనిచేస్తుంటారని, వారికి అన్ని సదుపాయాలు ఉంటాయని సాధారణంగా భావిస్తామని మంత్రి వివేక్ అన్నారు. అయితే అది తప్పని చెప్పారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ వర్కర్ల సమస్యల గురించి మాట్లాడారని మంత్రి వివేక్ తెలిపారు. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారని చెప్పారు. అప్పట్లో గిగ్ వర్కర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే అంశంపై ఆలోచించామని, అందులో భాగంగానే తెలంగాణలో గిగ్ వర్కర్ల కోసం చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు.

హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు. నగరంలో అనేక సేవలను అందించడంలో గిగ్ వర్కర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిగ్ వర్కర్లకు మినిమం వేజ్ ఇవ్వలేదని మంత్రి వివేక్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో గిగ్ వర్కర్లకు మినిమం వేజ్ అందిస్తున్నామని తెలిపారు.కర్ణాటకలో కూడా మినిమం వేజ్ అమలు చేసినప్పటికీ ఆ అంశంపై కోర్టును ఆశ్రయించారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రం ఎలాంటి సమస్యలు రాకుండా మంచి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.

ఇంతకుముందు అజిత్‌నగర్‌లో గిగ్ వర్కర్లకు ఎలాంటి ఫెసిలిటీ లేదని, ప్రస్తుతం అక్కడ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇదే విధంగా నగరవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సేవలు అందిస్తున్నారని అన్నారు.గిగ్ వర్కర్లను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి వివేక్ చెప్పారు. రాబోయే రోజుల్లో గిగ్ వర్కర్లను మరింతగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

 

©️ VIL Media Pvt Ltd.