
టెల్అవీవ్: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు మరోసారి రియాక్ట్ అయ్యారు. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి వెనుక ఏ శక్తులు ఉన్నా వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి పాల్పడిన కో పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి లోనయ్యాడని ఆరోపించారు. పైలట్‌పై దాడి చేసి ప్రయాణికులతో సహా విమానాన్ని కూల్చివేయడమే అతని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఘటనపై యూఏఈ, ఇజ్రాయెల్ రక్షణ సంస్థల ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా, ఫ్లైదుబాయ్ ఘటనను యూఏఈ ఉగ్రవాద చర్యగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే..?
బుధవారం (సెప్టెంబర్ 30) ఆకాశంలో సినీ రేంజ్లో హైడ్రామా నడిచింది. ఫ్లైదుబాయ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కాక్ పిట్లో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో పైలట్ కత్తితో దాడి చేశాడు. పైలట్ల మధ్య ఘర్షణతో విమానం అదుపు తప్పింది.
ఆకాశంలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్ పిట్ నుంచి అరుపులు వినిపించడం, విమానం ఆకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొందరు పైలట్లు ధైర్యంగా కాక్ పిట్ డోర్ బద్దలుకొట్టి పైలట్‌పై దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల (ఆన్-డ్యూటీ సిబ్బంది) సహాయంతో విమానాన్ని ఈశాన్య సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సౌదీ పోలీసులు కో పైలట్ను అరెస్ట్ చేశారు. గాయపడ్డ పైలట్ను ఆసుపత్రికి తరలించారు. కో పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించినట్లు సౌదీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు యూఏఈ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఫ్లైదుబాయ్ విమాన ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.