
వ్యాక్సిన్ల తయారీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి రక్షణ కల్పిస్తున్నప్పటికీ, సముద్రంలో ఉండే షార్క్ చేపలకు (Shark Fish) మాత్రం ఇది ఒక పెద్ద ప్రమాదంగా మారింది. దీనికి కారణం షార్క్ చేపల కాలేయం (లివర్) నుంచి తీసే ఒక రకమైన నూనె. ఈ షార్క్ లివర్ ఆయిల్‌లో ఉండే ‘స్క్వాలెన్’ (Squalene) అనే పదార్థాన్ని వివిధ వ్యాక్సిన్ల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మానవులలో రోగనిరోధక శక్తిని (Immunity) గణనీయంగా పెంచడంలో ఈ స్క్వాలెన్ ఎంతగానో దోహదపడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఆధారిత సమాచారం ప్రకారం.. చాలా రకాల వ్యాక్సిన్లలో ఈ స్క్వాలెన్‌ను ముఖ్య పదార్థంగా వాడుతున్నారు. అయితే, ప్రపంచజనాభాకి సరిపడే స్థాయిలో వ్యాక్సిన్లు తయారు చేయాలంటే లక్షలాది షార్క్ చేపలను చంపక తప్పడం లేదు. ఒక్క విడత వ్యాక్సిన్ డోసుల తయారీకే కనీసం 5 లక్షల షార్క్ చేపలను వేటాడాల్సి వస్తోందని అంచనా. నిజానికి ఈ స్క్వాలెన్‌ను మొక్కల నుంచి కూడా తయారు చేయవచ్చు.
కానీ, షార్క్ లివర్‌లో లభించినంత ఎక్కువ మొత్తంలో మొక్కలలో లభించదు. పైగా మొక్కల నుంచి దానిని సేకరించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే కాస్మొటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఈ షార్క్ స్క్వాలెన్‌ను వాడుతున్నారు. దీనికి తోడు ఆహారం కోసం కూడా షార్క్ చేపలను పెద్ద ఎత్తున వేటాడుతున్నారు.
ఇదే రీతిలో షార్క్ చేపలను చంపుకుంటూ పోతే.. త్వరలోనే ఇవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్క్వాలెన్ ఎక్కువగా లభించే ‘గుల్పర్ షార్క్’, ‘బాస్కింగ్ షార్క్’ రకాలు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ వీటి వేట ఆగడం లేదు. కృత్రిమంగా లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ స్క్వాలెన్‌ను తయారు చేయడం ప్రస్తుతానికి సాధ్యపడకపోవడంతో.. వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం షార్క్ చేపలపైనే ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.