Reading Time: 2 minutes

ఇరాన్ యుద్ధం ముందు స్థాయికి క్రూడ్ సరఫరా.. ఆయిల్ కంపెనీల హోర్ముజ్ వ్యూహం సక్సెస్!

Caption of Image.

భారతీయ ఆయిల్ రిఫైనర్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ముడి క్రూడ్ ఆయిల్ నేరుగా సేకరించేందుకు హోర్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్లను పంపే దిశగా తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. వ్యూహాత్మకంగా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, తమ సరఫరా గొలుసును మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి దాడుల ముప్పు కారణంగా భారతీయ రిఫైనర్లు ఈ మార్గంలో తమ సొంత ట్యాంకర్లను పంపడానికి సాహసించేవారు కాదు. అంతర్జాతీయ వ్యాపారులు లేదా గల్ఫ్ దేశాల ఉత్పత్తులపైనే ఆధారపడి, ఖరీదైన సరుకు రవాణా పద్ధతుల ద్వారా ఆయిల్ దిగుమతి చేసుకునేవారు.

అయితే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌‌పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ సంస్థలు ఇరాక్ నుంచి ‘ఫ్రీ-ఆన్-బోర్డ్’ ప్రాతిపదికన క్రూడ్ కొనుగోళ్లను ప్రారంభించాయి. ఈ పద్ధతి ప్రకారం కొనుగోలుదారులే స్వయంగా నౌకలను ఏర్పాటు చేసుకుని, సరుకును లోడ్ చేయించి గమ్యస్థానానికి చేర్చాలి. దీనివల్ల రవాణా ఖర్చులపై పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఈ టెండర్ల ప్రక్రియలో సినోకోర్ గ్రూప్, డైలకామ్ ట్యాంకర్స్ మేనేజ్‌మెంట్ సంస్థలు కాంట్రాక్టులను దక్కించుకోగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లీలా గ్లోబల్ చేసిన బిడ్లు రద్దయ్యాయి.

ఈ కీలక మార్పునకు ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధి గుండా క్రూడ్ రవాణా సాధారణ స్థితికి రావడం.. సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ పునరుద్ధరించబడటమే. మిడిల్ ఈస్ట్ నుంచి ముడి చమురు రవాణా తిరిగి సాధారణ స్థాయికి చేరుకుందని జేపీ మోర్గాన్ నివేదిక వెల్లడించింది. మరోవైపు.. అమెరికా నుంచి పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇరాక్ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ‘సోమో’ అక్టోబర్ నెలవారీ సరఫరాలపై ప్రాంతీయ బెంచ్‌మార్క్‌ల కంటే బ్యారెల్‌కు 37 డాలర్ల డిస్కౌంట్ ప్రకటించి భారతీయ రిఫైనర్లను ఆకర్షించింది.

ALSO READ : SIR పై ముంబై హైకోర్టు సీరియస్..

గతంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో వెళ్లే నౌకలపై భారతీయ సిబ్బందిని అనుమతించకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆంక్షలు విధించింది. అయితే ఆగస్టులో ఈ నిబంధనలను సడలిస్తూ.. నావికుల సమ్మతితో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. ఈ సానుకూల పరిణామాల ఫలితంగా సెప్టెంబర్ నెలలో ఈ జలసంధి గుండా భారత్‌కు సగటున రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అయింది. ఇది యుద్ధానికి ముందు ఫిబ్రవరి నాటి స్థాయికి సమానం. ప్రస్తుతం మధ్యప్రాచ్యం నుంచి భారత్ మొత్తం 2.8 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ కొత్త వ్యూహం ద్వారా భారతీయ కంపెనీలు సముద్ర మార్గంలో రవాణా ఖర్చులను భారీగా ఆదా చేసుకునేందుకు అవకాశం లభించింది. 

©️ VIL Media Pvt Ltd.