
ఆసియా గేమ్స్ 2026లో భారత బాక్సర్ పార్వీన్ సత్తా చాటింది. మహిళల 65 కేజీల బాక్సింగ్ విభాగంలో చైనీస్ తైపీకి చెందిన చెన్ నియన్‌చిన్‌పై 3-2తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పార్వీన్ స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించింది. తొలి రౌండ్‌లో పార్వీన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు అనుకూలంగా తీర్పునివ్వడంతో 5-0తో రౌండ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో రౌండ్‌లో చైనీస్ తైపీ బాక్సర్ బలంగా పుంజుకుని 5-0తో గెలిచింది. దీంతో పోరు పూర్తిగా సమంగా మారింది. నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో పార్వీన్ ఒత్తిడిని అధిగమించి అద్భుతంగా పోరాడింది. ముగ్గురు జడ్జీలు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో గెలిచి గోల్డ్ మెడల్ అందుకుంది.
ఈ విజయం పార్వీన్‌కు ప్రత్యేకమైనది. హాంగ్‌జౌ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె.. అనంతరం సస్పెన్షన్ కారణంగా ఆ పతకాన్ని కోల్పోయింది. తాజా స్వర్ణంతో గత చేదు అనుభవానికి బలమైన సమాధానం ఇచ్చింది.
గోల్ట్ సాధించిన బాక్సర్ అంకుశ్ పంఘల్
ఆసియా గేమ్స్ 2026లో భారత బాక్సర్ అంకుశ్ పంఘల్ అదరగొట్టాడు. పురుషుల 80 కేజీల బాక్సింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ పోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన అంకుశ్.. భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చాడు. దీంతో ఆసియా గేమ్స్ బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య మరింత పెరిగింది. దేశం తరఫున పోటీపడిన అంకుశ్ పంఘల్ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండు విజయాలతో ఆసియా గేమ్స్ చరిత్రలో భారత్‌కు బాక్సింగ్‌లో 14వ స్వర్ణాలు లభించాయి.
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలి రెజ్లింగ్ గోల్డ్.. సుజీత్ కల్కల్ సంచలనం
ఆసియా గేమ్స్ 2026లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న క్రీడల్లో పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ విజయంతో 2026 ఆసియా గేమ్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించాడు. నగోయా సిటీ ఇనాయే స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఫైనల్లో సుజీత్ కల్కల్ తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌మజీద్ కుడియెవ్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిని ఓడించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సుజీత్ అద్భుత ప్రదర్శనతో భారత రెజ్లింగ్ బృందంలో సంబరాలు నెలకొన్నాయి. 65 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన కల్కల్.. ఆసియా గేమ్స్ వేదికపై భారత్‌కు మరో ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాన్ని అందించాడు.
(@olympickhel)