
PM Modi: మన దేశానికి చెందిన ఓ యువ పైలట్ చూపిన తెగువ, చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ప్రమాదం జరిగేది. కానీ, ఆ ఫ్లైట్ కో-పైలట్ చేసిన దాడిని, విమానాన్ని కూల్చేయడానికి జరిగిన కుట్రను మన భారతీయ పైలట్ క్యాప్టెన్ స్మిత్ మఛార్ తన ప్రాణాలను పణంగా పెట్టి తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనప్పటికీ, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి రియల్ హీరో అనిపించుకున్నారు. సెప్టెంబర్ 30 బుధవారం రోజున ఈ హైడ్రామా నడిచింది. అయితే.. తాజాగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో కూడా పైలట్ చూపిన అసమాన ధైర్యాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆ ఘటన సమయంలో తనకు ఎలా ధైర్యం వచ్చింది, ఆ అనుభవం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ భయానక వాతావరణంలో తనను ముందడుగు వేసేలా చేసిన ధైర్యానికి గల కారణాలను కెప్టెన్ స్మిత్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. ఆయన చూపిన తెగువను మెచ్చుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా.. నిన్న (గురువారం) యూపీఎస్సీ (UPSC) 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ ఈ ఘటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. విమానంలో జరిగిన ఆ దాడిని తిప్పికొట్టడంలో స్మిత్ చూపిన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం సాటిలేనివని అన్నారు. సరిగ్గా అమెరికాలో 2001లో జరిగిన 9/11 ఉగ్రదాడి తరహాలోనే విమానాన్ని హైజాక్ చేసి కూల్చేయాలని చూసిన ప్రమాదాన్ని ఈ భారతీయుడు విజయవంతంగా అడ్డుకున్నాడని ప్రధాని ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఈ భారతీయ పైలట్ తెగువను మెచ్చుకున్నారని, ఈ ఘటనతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాడని మోడీ ఉద్వేగంగా చెప్పారు.