Reading Time: < 1 minute
Telangana Gram Panchayats Cheque Payments Seethakka Orders

Cheque Power : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల నిధుల విడుదల, వివిధ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెక్కుల చెల్లింపులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూడాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులకు (DPO) స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయి అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.

7 రోజులకు మించి ఆలస్యం చేస్తే కలెక్టర్ విచారణ

చెక్కులపై సంతకాలు చేయడంలో ఉప సర్పంచ్‌లు అనవసరంగా జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తగిన కారణం లేకుండా 7 రోజులకు మించి చెక్కులపై సంతకం చేయకుండా ఉప సర్పంచ్‌లు కాలయాపన చేస్తే, సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఆ విచారణలో ఉప సర్పంచ్ ఉద్దేశపూర్వకంగానే చెక్కులను నిలిపివేసినట్లు తేలితే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

అధికారులకు జాయింట్ ‘చెక్ పవర్’ బదిలీ

కారణం లేకుండా ఏడు రోజులకు మించి చెక్కులను పెండింగ్‌లో పెడితే, గ్రామ పంచాయతీల్లో నిధుల చెల్లింపులు ఆగిపోకుండా ఉండేందుకు కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. అటువంటి పరిస్థితుల్లో ఉప సర్పంచ్‌ల జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసి, వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ (MPO) లేదా ఎంపీడీవో (MPDO) లలో ఒకరికి జాయింట్ ‘చెక్ పవర్’ కేటాయించేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు వేగవంతం కావడమే కాకుండా, చెక్కుల సంతకాల చుట్టూ తిరిగే పంచాయితీలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.