Reading Time: < 1 minute

లేడీ డాక్టర్ను కొట్టి స్టెతస్కోప్ ఎత్తకపోయిన సైకో.. భూదాన్ పోచంపల్లిలో ఘటన !

Caption of Image.

భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో సైకో  వీరంగం సృష్టించాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం వచ్చి డ్యూటీలో ఉన్న మహిళ డాక్టర్ను దుద్యాల వెంకట తిరుపతి అనే వ్యక్తి  చెంప మీద కొట్టాడు.

డాక్టర్ను కొట్టిన సైకో స్టెతస్కోప్ను ఎత్తుకెళ్లాడు. సైకోపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ వైద్యులు డ్యూటీ మానేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మే 2026లో హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

ఘట్​కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ సైకో అప్పట్లో వీరంగం సృష్టించాడు. చాకుతో చొరబడి డాక్టర్లు, రోగులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఉన్మాది అకస్మాత్తుగా ఆసుపత్రిలోకి ప్రవేశించి, తాను రైలు నుంచి కింద పడ్డానని, తనకు వెంటనే చికిత్స చేయకపోతే చంపేస్తానంటూ చేతిలో ఉన్న చాకుతో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, చికిత్స పొందుతున్న రోగులపై దాడికి దిగాడు.

ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా హాస్పిటల్​ సామగ్రిని, ఫర్నిచర్​ను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించాడు. దీంతో రోగులు, వారి బంధువులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఉన్మాది రోడ్డుపై వెళ్లేవారిపై దాడికి తెగబడ్డాడు. 

సమాచారం అందుకున్న ఘట్​కేసర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులపై కూడా తిరగబడటంతో ఓ కానిస్టేబుల్​కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఆ సైకోను చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉన్మాదిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.

©️ VIL Media Pvt Ltd.