
గత దశాబ్ద కాలంగా నిరంతర బుల్‌రన్‌తో దూసుకుపోయిన భారత స్టాక్ మార్కెట్లకు 2026 సంవత్సరం చుక్కలు చూపిస్తోంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనుకున్న దలాల్ స్ట్రీట్ ఊహించని విధంగా భారీ పతనానికి గురైంది. గ్లోబల్ పరిణామాలు, దేశీయ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో నిఫ్టీ 50 సూచీ సుమారు 13.5% మేర కుప్పకూలి నెగటివ్ రిటర్న్స్ అందించింది పెట్టుబడిదారులకు. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద వార్షిక నష్టాలతో కొనసాగుతోంది. 2016 నుంచి 2025 వరకు ప్రతీ ఏడాదీ లాభాలతో ముగిసిన మార్కెట్లకు ప్రస్తుత ఏడాది ఒక పెద్ద షాక్‌లా మారింది.
భారీగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ కోలుకోవటానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగిన ఘర్షణల ప్రభావం క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్రంగా పడింది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడటంతో.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లకు పైకి చేరుకోవటం దేశంలో ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. రూపాయి విలువ పడిపోవడం, AI రంగంలో తగినంత వాటా లేకపోవడం, టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌తో పాటు రిలయన్స్, ఐటీసీ షేర్లు నష్టపోవడం సూచీలను మరింత పడగొట్టాయి.
వీటన్నింటికీ తోడు ఎల్‌నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశంలో 43% శ్రామిక శక్తిని కలిగి ఉన్న వ్యవసాయ రంగం మందగించడం కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ALSO READ : డబుల్ బొనాన్జా: కొత్త నెలలో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్
దన్నుగా నిలిచిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్
విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నప్పటికీ.. దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ పెట్టుబడుల రూపంలో అందిస్తున్న నిరంతర మద్దతు లేకపోతే మార్కెట్ పతనం మరింత తీవ్రంగా ఉండేది. సాధారణ ఇన్వెస్టర్ల ఈ పెట్టుబడులే మార్కెట్ పూర్తిగా కుప్పకూలకుండా కొంతవరకు కాపాడుతున్నాయి.
భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు కొనుగోలు అవకాశం దొరుకుతుందా?
ప్రస్తుత స్వల్పకాలిక మార్కెట్ కరెక్షన్ భయపెడుతున్నప్పటికీ.. దీర్ఘకాలికంగా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నిపుణులు భావిస్తున్నారు. బాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు కనిష్ట స్థాయికి చేరడం, కంపెనీల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉండటం సానుకూలాంశాలు. రాబోయే పండుగ సీజన్ డిమాండ్, 8వ వేతన సంఘం అమలు వంటి పరిణామాలు మార్కెట్‌కు మళ్లీ ఊతమిచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు అనవసర భయాందోళనలకు గుండా, బలమైన ఫండమెంటల్స్ ఉన్న షేర్లపై దృష్టి పెట్టడం మంచిది.