Reading Time: < 1 minute
Chandrababu On Bc Reservations Ap Govt To Approach Supreme Court

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమం, అభివృద్ధి, బీసీ రిజర్వేషన్లు, పోలవరం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ బీసీలకు అండగా ఉందని అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తామే అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ 34 శాతానికి పెంచామని తెలిపారు. అయితే 34 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి అడ్డుకుందని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.

బీసీ వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వారు డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 300 కేసులు వేశారని ఆరోపించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదల సమస్యలను పరిష్కరిస్తూ సుపరిపాలనతో పునర్నిర్మాణం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు ఇష్టానుసారంగా అప్పులు చేశారని, ప్రస్తుతం ఒక్కో సమస్యను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..